calender_icon.png 27 October, 2024 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురి కుదిరేనా!

22-07-2024 12:05:00 AM

ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యధిక పతకాలు అందించిన క్రీడాంశాల్లో షూటింగ్‌ది మూడో స్థానం. హాకీ (12), రెజ్లింగ్ (7) తర్వాత భారత్‌కు షూటింగ్‌లోనే ఎక్కువ (4) మెడల్స్ దక్కాయి. రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ రజతంతో విశ్వక్రీడల్లో భారత ఖాతా తెరిస్తే.. అభినవ్ బింద్రా తొలి పసిడి ముద్దాడాడు. ఆ తర్వాత హైదరాబాదీ షూటర గగన్ నారంగ్, విజయ్ కుమార్ కూడా పతకాలు నెగ్గారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 21 బంది బరిలోకి దిగుతుండగా.. హైదరాబాదీ ఇషా సింగ్, మనూ భాకర్, ఎలవెనిల్ వలరివన్, ప్రతాప్ సింగ్ పతక ఆశలు రేపుతున్నారు!

విజయక్రాంతి, ఖేల్ విభాగం : ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించే.. భారత షూటర్లు ఒలింపిక్స్‌లో అదే జోరు కొనసాగించలేకపోతున్నారు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విశ్వక్రీడల్లో రజతంతో బోణీ కొడితే.. 2008లో అభినవ్ బింద్రా బంగారు పతకంతో సంచలనం సృష్టించాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఇదే భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం కావడం గమనార్హం.

ఆ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యంతో మెరిశారు. దీంతో షూటింగ్‌పై భారీ అంచనాలు పెరగగా.. ఆ తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్ (2016 రియో, 2020 టోక్యో)లో మనవాళ్లు రిక్త హస్తాలతోనే వెనుదిరిగారు. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వేదికలపై నిలకడగా రాణిస్తున్న భారత షూటర్లు.. ఈ సారి ఒలింపిక్స్‌లోనూ సత్తాచాటుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా క్రీడల్లో భారత షూటర్లు 7 స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించి అదుర్స్ అనిపించారు. అప్పుడు మెడల్స్ సాధించిన పలువురు షూటర్లు.. పారిస్ బరిలోనూ ఉన్నారు. 

ఇషాపైనే ఆశలు!

పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్లు.. చిన్నప్పటి నుంచే షూటింగ్ రేంజ్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగనుంది. ప్రపంచ స్థాయి పోటీల్లో నిలకడగా రాణిస్తున్న 19 ఏళ్ల ఇషా.. విశ్వక్రీడల్లో 25 మీటర్ల వ్యక్తిగత ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీపడనుంది. ఇటీవల ఆసియా క్రీడల్లో 4 పతకాలు సాధించి ‘పిట్ట కొంచం కూత ఘనం’ అనిపించుకున్న ఇషా.. ఒలింపిక్స్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇక టీనేజ్‌లోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న మనూ బాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో మూడు విభాగాల (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్)కు అర్హత సాధించడం విశేషం.

గత ఒలింపిక్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా బరిలోకి దిగి కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయిన మనూ ఈ సారి ఏం చేస్తుందో చూడాలి. వీళ్లతో పాటు.. ఎలవనిల్ వలరివన్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, సిఫ్త్ కౌర్, అంజుమ్, అర్జున్ బబుతా, సరబ్‌జ్యోత్, రిథమ్ సాంగ్వాన్, విజయ్‌వీర్, అర్జున్ చీమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఒత్తిడిని జయించి ముందడుగు వేస్తే.. ఈ సారి షూటింగ్‌లో భారత్ లెక్కకు మిక్కిలి పతకాలు నెగ్గే అవకాశాలున్నాయి.