calender_icon.png 31 March, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకు చోటివ్వరా?

29-03-2025 01:32:08 AM

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మాదిగ, లంబాడ సామాజికవర్గం ఎమ్మెల్యేల ప్రశ్న

బీసీల్లో ఇద్దరికి అవకాశమివ్వాలని డిమాండ్ 

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మొండి చెయ్యేనా?

ఆశావాహుల్లో నెలకొన్న ఉత్కంఠ        

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి) : రాష్ట్రంలో క్యాబినేట్  విస్తరణ కాకరేపుతున్నది. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు పూర్తిచేసిన పార్టీ అధిష్ఠానం.. ఏ క్షణమైనా కొత్త అమాత్యుల జాబితాను విడుదలచేయబోతున్నట్లు అధి కార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ రేపుతున్నది.

తమ సామాజికవర్గాలకు మంత్రి పదవి కావాలంటూ పలువురు ఎమ్మెల్యేల డిమాండ్లు తెరపైకి రావడం హస్తం పార్టీలో చర్చనీ యాంశంగా మారింది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌లో ఆరు బెర్తులే ఖాళీగా ఉన్నాయి.. ఆశావాహులు మాత్రం డజన్ మందికి  పైగా ఉన్నా రు. క్యాబినెట్ కూర్పు విషయంలో ఇప్పటికే జిల్లా సమీకరణాలు, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకు ని ఓ అంచనాకు వచ్చినా, పార్టీ అధిష్ఠానానికి ఇప్పుడు పరిస్థితి జఠిలంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

తెలంగాణలో 32 లక్షలకు పైగా జనాభా ఉన్న మాదిగ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లలో అన్యాయం జరిగిందని, మంత్రి వర్గ విస్తరణలోనైనా న్యాయం చేయాలని మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్య, తోట లక్ష్మికాంతరావు లేఖలు రాశారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఎస్సీలోని మాల సామాజికవర్గం నుంచి డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌కు పార్టీ అవకాశం కల్పించిన విషయాన్ని మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు గుర్తుచేస్తున్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాల సామాజికవర్గానికి కాకుండా మాదిగలకు ఇవ్వాలని కోరుతున్నారు. అందుకు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను స్వయంగా కలిసి విన్నవించాలనే ఆలోచనతో ఉన్నారు.

బీసీలకు రెండు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. మున్నూరు కాపు, గొల్ల, కుర్మ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌కు బెర్తు ఖాయమని ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒక్క శ్రీహరితోనే సరిపెడుతారా? లేక బీసీల్లో మరొకరికి అవకాశం కల్పిస్తారా? అనేది ప్రశ్నగా మారింది. ఇక ఎస్టీల్లోని లంబాడ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతున్నారు. మంత్రివర్గంలో ఇప్పటికే ఆదివాసీ నుంచి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 నియోజకవర్గాలకు పైగా లంబాడిల ప్రభావం ఉంటుం దని, వారు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అండగా నిలిచారని చెబుతున్నారు. ఇదే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వడంతో పాటు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక నల్లగొండ జిల్లా నుంచి రెడ్డి సామాజికవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు మంత్రులుగా ఉండగా, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం రేసులో ఉన్నారు. తనకు మంత్రిపదవి ఇస్తామని అధిష్ఠానం మాట ఇచ్చిందని, తనకు క్యాబినెట్‌లో చోటు దక్కుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బలమైన నమ్మకంతో ఉన్నారు.

ఉమ్మడి అదిలాబాద్ నుంచి ఓ వైపు వివేక్, మరోవైపు ప్రేమ్‌సాగర్‌రావు గట్టిగా ప్రయత్నాలు చేస్తుండటం పరిస్థితి మరింత సీరియస్‌గానే మారుతున్నది. వివేక్ కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లారని, ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన విషయాన్ని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఒకే కటుంబం వివేక్, వినోద్ ఎమ్మెల్యేలుగా ఉండగా, వివేక్ తనయుడు వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉన్న విషయాన్ని పార్టీలోని పలువురు సీనియర్లు గుర్తుచేస్తున్నారు.

అంతేకాకుండా మాల సామాజిక వర్గం నుంచి ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉండగా, అదే సామాజికవర్గానికి చెందిన వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైందనే వార్తలు వినిపిస్తుండగా, అదే జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావు కూడా అమాత్య పదవీ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

వీరితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి గతంలో కనీసం నలుగురు లేదా ఐదుగురు వరకు మంత్రులు ఉండేవారని, ఇప్పుడు  ఒక్కరు కూడా లేరని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం జనాభాలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే 30 శాతం జనాభా ఉంటుందని, ఇక్కడి నుంచే రాష్ట్రానికి ఎక్కువగా ఆదాయం సమకూరుతుం దని, అలాంటి ఈ జిల్లాల నుంచి మంత్రివర్గ విస్తరణలో న్యాయం దక్కాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా మంత్రిపదవీ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు.