ఈ నెల 23న కేంద్ర బడ్జెట్
- పన్నుల్లో రాయితీ, వడ్డీరేట్లు తగ్గించాలని ఏళ్లుగా డెవలపర్ల డిమాండ్
- పన్నుల హేతుబద్ధీకరణపై రియల్టర్ల ఆశలు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 7 (విజయక్రాంతి): ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాకు నిర్మాణ రంగానిది కీలక పాత్ర. దేశంలో పట్టణీకరణ పెరుగుతుండటం, రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు దండీగా ఆదాయం సమకూరుతోంది. అయితే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నిర్మాణ రంగాన్ని పూర్తిస్థాయి పరిశ్రమగా గుర్తించి రియల్ రంగానికి ప్రోత్సాహకాలను అందిస్తే దేశంలో ఈ రంగం మరింత వృద్ధిని నమోదు చేసుకోవడంతోపాటు అన్ని వర్గాల ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం 2024 వార్షిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌కు కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, ఈ నెల 23న పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే నిర్మాణ రంగం డిమాండ్లకు ప్రస్తుత బడ్జెట్‌లో మోక్షం లభిస్తుందా? లేదా? అనేది సందిగ్దంగా మారింది. వాస్తవానికి ప్రపంచ వ్యప్తంగా ఆర్థిక వ్యవస్థలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆశించిన వృద్ధిరేటును కొనసాగించాలంటే బడ్జెట్‌లో జీడీపీపై ప్రధానంగా దృష్టి ఉండాలని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. జీడీపీ ఆశించిన వృద్ధి రేటును సాధించడంలో రియల్ ఎస్టేట్ రంగం అత్యంత కీలకం.
పన్ను రాయితీలు పెంచాలని..
అనేక ఏళ్లుగా గృహ రుణాలపై పన్ను రాయితీలను పెంచాలని నిర్మాణ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. దీని వల్ల ఇండ్ల కొనుగోలుదారులతోపాటు రియల్ రంగానికి మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇండ్ల రుణాలకు సంబంధించిన వడ్డీ చెల్లింపులపై ఆదాయ పన్ను రాయితీ ప్రస్తుతం రూ.2 లక్షల వరకు ఉంది. దీనిని సుమారు రూ.5 లక్షల వరకు పెంచాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కేంద్ర ప్రభుత్వాన్ని అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుండటంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది.
ఈ డిమాండ్లపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే నిర్మాణ రంగం మరింత వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాట్‌లలో మార్పులు చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలతో సహా వేర్వేరు రంగాలకు మేలు జరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. నూతన ప్రభుత్వంలో రాబోయే బడ్జెట్‌లో గణనీయమైన సంస్కరణలు ఉంటాయని రియల్ రంగం ఆశిస్తోంది. దీర్ఘకాలంగా కోరుతున్న పూర్తిస్థాయి పరిశ్రమ హోదా దక్కితే పన్ను ప్రయోజనాలతోపాటు చట్టపరమైన పన్ను ప్రోత్సాహకాలు, ప్రాధాన్యతాక్రమంలో రుణాల లభ్యత ఉంటుందా? లేదా? అనేది స్పష్టత లేదు.
అన్ని వర్గాలకు వర్తింపజేయాలి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.3 కోట్ల ఇండ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిర్మాణ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరిన్ని వర్గాలకు వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని రియల్టర్లు కోరుతున్నారు. దేశంలో రియల్ ఎస్టేట్ వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఈ రంగంలో మరిన్ని సంస్కరణలు చేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని రియల్టర్లు భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా దేశవ్యాప్తంగా 50 శాతం నిర్మాణదారులు పన్నుల హేతుబద్ధీకరణ, వడ్డీ రేట్ల తగ్గింపును ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం రియల్టర్ల ఆశలకు భరోసానిస్తుందా? లేక వారి ఆశలపై నీళ్లు చల్లుతుందా? అనేది వేచిచూడాలి మరి.
మౌలిక వసతులపై దృష్టి
దేశంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంతో వచ్చే ఐదేళ్ల ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం వృద్ధి ఆదారిత బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని నిర్మాణ రంగా లు ఆశిస్తున్నాయి. వికసిత్ భారత్‌గా మార్చడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిం చాల్సిన అసవరం ఉందని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ డిమాండ్ పెంచే స్థిరమైన వృద్ధిని నడిపించే బడ్జెట్‌ను రియల్టర్లు కోరుకుంటున్నారు.
పెట్టుబడులను ప్రోత్సహిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఏ) ఎక్కువగా వస్తాయని, రియల్ ఎస్టేట్ రంగంలో గృహాలు స్థిరమైన డిమాండ్ కొనసాగించడం చాలా కీలమని, నిర్మాణ రంగం వందల అనుబంధ రంగాలకు చోదకశక్తిగా ఉందని నిర్మాణదారులు అభిప్రాయపడుతున్నారు. 2024 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం గృహ రుణాలపై పన్ను మినహాయింపు పరిమితులను పెంచితే నివాస యూనిట్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్‌కు పరిశ్రమ హోదాను కల్పిస్తే విదేశీ పెట్టుబడుల భాగస్వామ్యం పెరగడంతోపాటు నిధుల లభ్యత సులభతరం అవుతుందని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు.