- సీఎం రాకపైనే పాలమూరు ఆశలు
- కడుపు నింపేలా నిధులిస్తారని ఎదురుచూపు
- నేడు మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి రాక
- సాగునీటి ప్రాజెక్టులపైనే ప్రత్యేక చర్చ
మహబూబ్‌నగర్/నాగర్‌కర్నూల్, జూలై 8 (విజయక్రాంతి): కరువుకు కేరాఫ్‌గా మారి న ఉమ్మడి పాలమూరు ఏళ్లుగా అభివృద్ధికి దూరంగానే ఉన్నది. స్థానికంగా ఉపాధి దొర క్క బతుకుదెరువు కోసం వలసలు వెళ్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన నేత రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో ఆయనపైనే గంపెడు ఆశలు పెట్టుకు న్నారు ఉమ్మడి జిల్లా ప్రజలు. నేడు సీఎం జిల్లాలో పర్యటించనుండడంతో అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు తక్కువ సమయంలో సాగునీరు అందించేందుకు పక్కా ప్రణాళికలను రచించేందుకు అధికారులు, ఎమ్మెల్యేల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని సమీక్షించనున్నారు.
ఈ సమావేశంలో సాగునీటి ప్రాజె క్టులపైనే ప్రత్యేక చర్చ సాగనున్నది. ఇప్పటికే ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి నివేదికలను తయారు చేసి ఉంచారు. పాలమూ రురంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి కృషి చేస్తారని భావిస్తున్నారు. మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల పనులు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్న అభిప్రాయం స్థానిక ప్రజల్లో ఉన్నది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వాటి అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నారు. నత్తనకడకన నడుస్తున్న ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించి సాగునీరు తిప్పలు లేకుండా చేస్తారని రైతులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
గత ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రతిపాదిత వ్యయం రూ. 35,200 కోట్లు అంచనా వేయగా పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ సర్కారు రూ.55వేల కోట్ల వరకు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. ఈ సమీక్ష సమావేశంలో ప్రతీ నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ నిర్మించాలనే అలోచనతో ప్రభుత్వం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి 9 నియోజక వర్గాలకు కృష్ణానీటిని అందిస్తామని చెప్పిన బీఆర్‌ఎస్ పదేళ్లు నత్తనడకన పనులు జరిపి ఒక్క మోటారుతో ఆదరబాదరాగా ప్రారంభించి చేతులు దులిపేసుకుంది. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేందుకు ఉమ్మడి రాష్ట్రంలో బీజం పడిన ఎస్‌ఎల్‌బిసీ శ్రీశైలం ఎడమగట్టు సొరంగం పనులు కూడా పూర్తి చేయలేక చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నేడు నిర్వహించే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
సీఎం సమీక్ష ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించేన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి ఏర్పాట్లను పరిశీలించారు.