గత కొద్ది నెలలుగా నివురుకప్పిన నిప్పులా ఉన్న మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సహా పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడి చేశారు. మహిళలు, చిన్నారులను పొట్టనపెట్టుకుంటున్న వారిని శిక్షించలేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ పలు వాహనాలకు నిప్పు పెట్టా రు.
కొద్ది రోజుల క్రితం జిరిబామ్‌లో ఉగ్రవాదులు అపహరించి హత్య చేసి ఆరుగు రి మృతదేహాలు లభించడంతో పెద్ద ఎత్తు న విధ్వంసం జరిగింది. దీంతో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మృతులలో ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు చిన్నారులు ఉన్నా రు. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు జరిగిన తర్వాత జిరిబామ్‌లోని పునరావాస కేంద్రం నుంచి ఆరుగురు అదృశ్యమయ్యారు.
వీరిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతదేహాలు శనివారం బారక్ నదిలో లభించాయి. ఒక మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను శుక్రవా రం రాత్రి కనుగొన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆగ్రహించిన నిరసనకారులు ప్రదర్శనలు జరిపారు. ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేశారు. ముఖ్యమంత్రి బీరే న్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్.కె ఇమో సహా ముగ్గురు శాసనసభ్యుల ఇండ్ల ను ధ్వంసం చేశారు. వారి ఆస్తులకు నిప్పు పెట్టారు.
ఇంఫాల్‌లోని వేర్వేరు ప్రాంతాలలో ఆందోళన చేస్తున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పటంతో ఇంఫాల్ లోయలోని ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్ జిల్లాలలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. శాసనసభ భవనానికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న తంగ్మైబాండ్ ప్రాంతం లో రోడ్డు మధ్యలో ఆందోళనకారులు టైర్లు వేసి నిప్పు పెట్టారు. జిరిబామ్ పట్టణంలో శనివారం రాత్రి కనీసం రెండు చర్చిలు, మూడు ఇండ్లను దగ్ధం చేశారు.
జిరిబామ్‌లో పది రోజుల క్రితం భద్ర తా సిబ్బందితో జరిగిన కాల్పులలో పది మంది కుకీ-జో యువకులు చనిపోయారు. వారంతా తీవ్రవాదులని, పోలీసు స్టేషన్‌పై దాడికి యత్నించారని పోలీసులు చెబుతున్నారు. వారంతా విలేజ్ వలంటీర్లని, మెయిటీల దాడులనుంచి రక్షణకోసం గస్తీ నిర్వహిస్తుండగా పోలీసులు నిష్కారణంగా చంపేశారనేది స్థానికుల వాదన.
ఇరవై నెలలుగా సాగుతున్న హింస
మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలు, రక్తపాతం కొనసాగడం తీవ్రంగా కలవరపరిచే అంశం. ప్రపంచమంతా తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ రాష్ట్రా న్ని సందర్శించి అక్కడ శాంతిని పునరుద్ధరించే పని చేపట్టకపోవడం దిగ్భ్రాంతిని కలిగించే అంశం. ఇరవై నెలలుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో వివాదం నెలకొం ది. 2023 మే ప్రారంభం నుంచి, హింస, స్థానభ్రంశం, ప్రాణనష్టం, జీవనోపాధి, ఆస్తినష్టం వంటివి సాధారణ స్థితిని దారుణంగా మార్చాయి.
2023 మే 3న, రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు దగ్గరగా ఉన్న చురచాంధ్పూర్ పట్టణంలో మెయిటీ, కుకీ తెగల మధ్య హింస చెలరేగింది. షెడ్యూల్ తెగ హోదా కోసం గిరిజనేతర మెయిటీ ప్రజల డిమాండ్ ఘర్షణలకు తక్షణ కార ణం. మెయిటీలు, కుకీలు సంక్లిష్టమైన చరి త్ర, సంబంధాన్ని పంచుకుంటారు.మెయిటీలు కుకీలను బయటి వ్యక్తులు, మాదక ద్రవ్యాల వ్యాపారులుగా చూస్తారు, కుకీలు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పరిపాలనా స్థానాలను కలిగి ఉన్న మెయిటీలకన్నా తాము అట్టడుగున ఉన్నట్లుగా భావిస్తారు.
కొన్నేళ్లుగా రెండు వర్గాల మధ్య అనేక గొడవలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ప్రస్తుత అల్లర్లు ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి, విద్యపై తీవ్ర పరిణామాలను చూపుతున్నా యి. అశాంతిని అణిచివేసేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల కేటా యింపు భూమిని కొనుగోలు చేసే హక్కు కు హామీ ఇచ్చే ప్రత్యేక హోదాను అందుకుంటామన్న మెయిటీ వాదనపై మెయిటీ, కుకీ గ్రూపుల మధ్య వివాదం రాజుకుంది.
తాజా హింస నేపథ్యంలో బీరేన్ పింగ్ ప్రభుత్వానికి ఏడుగురు శాసన సభ్యులు న్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) మద్ద తు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిం ది. అయితే ఎన్పీపీ మద్దతు ఉపసంహరించుకున్నా బీరేన్ సింగ్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. ఎందుకంటే 60 మంది సభ్యులున్న అసెంబ్లీ బీజేపీకి 32 మంది సభ్యులున్నారు. వీరితో పాటుగా నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు చెందిన ఐదుగురు, జేడీయూకు చెందిన ఆరుగు రు, మరో ముగ్గురు స్వతంత్రుల మద్దతు కూడా ప్రభుత్వానికి ఉంది.
జాతుల మధ్య వివాదం
ఏడాదిన్నరకు పైగా కొనసాగుతున్న అశాంతిలో 300 మందికి పైగా మరణించారు. కనీసం 80,000 మంది నిరాశ్ర యులయ్యారు. హింస చెలరేగడంతో, గ్రామాలు తగులబెట్టడం లైంగిక వేధింపుల నివేదికలు విస్తృతంగా వ్యాపించడం తో సైన్యం ప్రవేశించి రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన రెండు గ్రూపుల మధ్య పహరా కాస్తోంది. మణిపూర్ జనాభాలో 53 శాతం ఉన్న, ప్రధానంగా మణిపూర్ లోయలో నివసించే మెయిటీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ అశాంతిని నెలకొల్పింది.
కానీ అది కార ణం మాత్రమే. అంతర్లీనంగా ఉన్న కోపం, చాలా కాలం పాటు తెగల మధ్య వైరుధ్యం అన్నీ కలిసి మణిపూర్‌లో రావణకాష్టానికి దారితీసింది. రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో రిజర్వ్ చేయబడిన రక్షిత అడవులపై ప్రభుత్వనిర్బంధానికి మాత్రమే కాకుండా, కుకీల హింసకు గురవుతున్నామన్న భావనతో కూడా ఇది ముడిపడి ఉంది. మయ న్మార్లోని సరిహద్దుకు ఆవల ఉన్న ఒకే జాతికి చెందిన అనేక మంది చిన్లు భారతదేశంలోకి ప్రవేశించారు.
అక్రమ వలస దారులుగా పేర్కొంటూ వారిపై ప్రభుత్వం కఠినమైన వైఖరి అవలంబించడం కుకీల కు కోపం తెప్పించింది. మణిపూర్ కొండల్లోని రిజర్వుడ్ రక్షిత అటవీ ప్రాం తాలను గిరిజన సంఘాలు ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ముఖ్యమంత్రి కఠినమైన వైఖరి తీసుకోవడానికి వివిధ కారణాలున్నాయి. మణిపూర్‌లో భూమిపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. గిరిజన గ్రామాలలో జనాభా పెరగడంతో, వారు తమ చారిత్రక, పూర్వీకుల హక్కుగా భావించే చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు వ్యాపిస్తున్నారు.
దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో, లోయలో నివసించే మెయిటీలు, కొండ ప్రాంతాలలో స్థిరపడటానికి లేదా భూమిని కొనుగోలు చేయడానికి అనుమతించనందున కోపంతో ఉన్నారు. గిరిజన ప్రజలు లోయలలో భూమిని కొనుగోలు చేయవచ్చు. దీంతో సొంత పార్టీలోనే దుమారం రేగింది. ఇంఫాల్ లోయలోని తిరుగుబాటుదారులు శిబిరాల్లో చేరితే మెయిటీ, గిరిజన వర్గాల మధ్య పూర్తిస్థాయి సాయుధ పోరాటంగా సంక్షోభం తీవ్రరూపం దాల్చుతుందనే భయాల మధ్య సైన్యం, అస్సాం రైఫిల్స్ ఫ్లాగ్మార్చ్ని కొనసాగించడంతో శనివారం యుద్దవాతావరణం నెలకొంది.
ఇదే సమయంలో భారత్-మయన్మార్ సరిహ ద్దుల్లో అస్థిర పరిస్థితి నెలకొంది. మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరిం చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఇది హానికరం అని భద్రతా వర్గాలు వెల్లడించాయి. మైతేయీలైనా, కుకీలైనా అంద రూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు. సమస్య పరిష్కారమయి శాంతి నెలకొంటేనే సమా జం ముందుకు సాగుతుంది. అయితే ఈ మంటలను చల్లార్చేందుకు అటు ప్రభుత్వంతో పాటుగా అన్ని వర్గాలు ముందుకు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది.
-డా.ముచ్చుకోట సురేష్‌బాబు
వ్యాసకర్త సెల్: 9989988912