- డెమొక్రాట్లలో హారిస్‌కు పెరుగుతోన్న మద్దతు
- బైడెన్ వైదొలగాలంటూ కీలక నేతల సూచన
- ట్రంప్‌ను ఎదుర్కొనే శక్తి హారిస్‌కే ఉందని అభిప్రాయం
వాషింగ్టన్, జూలై 8: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి బైడెన్ పోటీపై సొంత పార్టీలోనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వార్తల నేపథ్యంలో ఇలాంటి డిమాండ్లు వ్యక్తమ వుతున్నాయి. పోటీ నుంచి తప్పుకోనని ఇప్పటికే బైడెన్ తేల్చిచెప్పారు. కానీ విరాళాల సేక రణలో డెమొక్రాట్లకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
బైడెన్ కంటే ప్రస్తుతం ట్రంప్‌ను ఎదుర్కొనే బలం వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్‌కే ఉందని పార్టీకి ప్రధాన దాతలతో సహా కార్యకర్తలు, అధికారులు అభిప్రా యపడుతున్నారు. ప్రతినిధుల సభలోని మైనారిటీ నేత హకీం జెఫరీస్ ఆదివారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో బైడెన్ నిష్క్రమించాలని కోరినట్లు సమాచారం. కొంతమంది ఆయనకు మద్దతుగా నిలిచినా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ బరిలో నిలిస్తే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో పార్టీలో ఆమెకు మద్దతు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే డెమొక్రాట్లు పలుసార్లు సమావేశం కాగా మంగళవారం జరిగే కాకస్ మీటింగ్‌లో ఏదో ఒకటి తేలే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
డిబేట్ నుంచి మొదలు
రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌తో డిబేట్‌లో బైడె న్ తడబడిన తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హకీం ఈ సమావేశాన్ని ఏర్పా టు చేశారు. మళ్లీ అధికారం దక్కాలంటే బైడెన్ పోటీలో ఉండొద్దని పలువురు నేతలు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ నుంచి దేశాన్ని కాపాడాలంటే బలమైన అభ్యర్థిని నిలపాల్సి ఉంటుందని వారు అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. సమావేశంలో బైడెన్‌కు బదులు కమలాహారిస్‌ను పోటీలో ఉంచాలని చాలా మంది నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికే తానే అభ్యర్థినని, డెమొక్రాట్లు తన వెంటే ఉన్నారని బైడెన్ ప్రకటించారు. బైడెన్ సన్నిహితుడు, హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ ఇటీవల మాట్లాడుతూ.. పోటీలో ఉండాలా? లేదా ? అనే విష యంపై కొన్ని రోజుల్లో బైడెన్ తన నిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు. పార్టీకి చెందిన గవర్నర్లతో భేటీ అనంతరం జోష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
హారిస్‌కు పెరుగుతున్న మద్దతు
ట్రంప్‌పై బైడెన్ కన్నా హారిస్ మెరుగ్గా రా ణించగలరని సర్వేలు సూచిస్తున్నాయి. ట్రం ప్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాయి. జూలై 2న విడుదల చేసి న సీఎన్‌ఎన్ పోల్‌లో బైడెన్‌పై ట్రంప్ ఆధిపత్యం సాగుతోందని పేర్కొంది.
ఎలా వెళ్లాలో చెప్పాల్సిందే
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బైడెన్ ఆరోగ్యంపై ఆందోళనకరమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. కొ న్నాళ్లుగా బైడెన్ హాజరయ్యే కార్యక్రమాల్లో ఆయన సహాయకులు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఎక్కడి ఎలా వెళ్లాలి? ఏ మార్గంలో రావాలి? బయటికి ఎలా వెళ్లాలి? వంటి విషయాలను ఓ కార్డు రూపంలో తయారు చేసి ఆ యనకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్డును యాక్సియోస్ అనే పత్రిక చేజిక్కుంచుకుని ఓ కథనాన్ని ప్రచురించింది. జూన్ 27న జరిగిన డిబేట్‌లో బైడెన్ పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షించిన తర్వాత నుంచి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.