calender_icon.png 19 January, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశలు తీరేనా!

04-08-2024 12:38:16 AM

  1. ఒలింపిక్స్‌లో సగం ఈవెంట్లు పూర్తి 
  2. భారత్‌కు ముచ్చటగా మూడు పతకాలే
  3. ఆశలన్నీ నీరజ్, మీరాబాయి, వినేశ్‌పైనే

ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమై 8 రోజులు కావొస్తుంది. పతకాల వేటలో చైనా, ఆతిథ్య ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలు దూసుకెళ్తుంటే.. మనం మాత్రం పతకాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. భారత అథ్లెట్లు పాల్గొన్న ఈవెంట్లు సగం పూర్తి కాగా.. ఇప్పటివరకు మనకు వచ్చిన పతకాలు కేవలం  మూడు మాత్రమే. ఆ మూడు కూడా కాంస్యాలే.. పతకాలు వస్తాయనుకున్న బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ విభాగాల్లో మన అథ్లెట్లు తీవ్రంగా నిరాశపరిచారు. రానున్న వారంలో అథ్లెటిక్స్ సహా వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ పోటీలు జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలతో మెరిసిన నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, మన రెజ్లర్లు మళ్లీ మెరిసి పతకాలను డబుల్ డిజిట్ దాటిస్తారా లేదా అన్నది చూడాలి.

విజయక్రాంతి, ఖేల్ విభాగం : పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సగం ఈవెంట్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు భారత్‌కు మూడు కాంస్య పతకాలు మాత్రమే వచ్చాయి. ఆ మూడు కాంస్యాలు కూడా షూటింగ్ విభాగం నుంచి వచ్చినవే. మనూ బాకర్ రెండు పతకాలు సాధించగా.. సరబ్‌జోత్ సింగ్, స్వప్నిల్ కుసాలే ఒక్కో పతకం అందించారు.

విశ్వక్రీడలు మొదలైన వారం రోజుల్లో పతకాల పట్టికలో మనం ఎక్కడున్నాం అని పరిశీలిస్తే..  మూడు పతకాలతో 47వ స్థానంలో  ఉన్నాం. మన కంటే చిన్న దేశాలైన కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ లాంటివి మెరుగైన ప్రదర్శనతో ముందు స్థానాల్లో  ఉన్నాయి. ఈసారి డబుల్ డిజిట్ పక్కా అని మన అథ్లెట్లు బల్లగుద్ది చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం దానిని నిరూపించడంలో విఫలమయ్యారు. బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్, బాక్సింగ్‌లో లవ్లీనా, నిషాంత్ దేవ్‌లు భారత పురుషుల హాకీ జట్టు మాత్రమే పతకాలపై ఆశలు కల్పిస్తున్నాయి.

సింధూ సహా 

ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధు ఈసారి కూడా మంచి అంచనాలతో బరిలోకి దిగి మూడో పతకంపై ఆశలు రేపింది. ప్రిక్వార్టర్స్ వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకొచ్చిన సింధూ ఇక్కడ మాత్రం షరా మాములుగానే చైనా గోడను దాటలేకపోయింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన భారత డబుల్స్ జోడీ సాత్విక్ జోడీ ఒలింపిక్స్‌లో మాత్రం తేలిపోయింది. క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టి తీవ్రంగా నిరాశపరిచారు. ఈ ఇద్దరి ఫామ్‌ను బట్టి చూస్తే పతకం ఖాయమనిపించింది. కానీ జరిగింది వేరు. 36 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ మన ఆర్చర్లు ఏమైనా అద్భుతాలు చేసి పతకం తీసుకొస్తారనుకుంటే అక్కడా నిరాశే మిగిలింది.

మిక్స్‌డ్ టీమ్‌లో సెమీస్ చేరిన ధీరజ్ జోడీ కీలక సమయంలో చేతులెత్తేయగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న దీపికా కుమారి క్వార్టర్స్‌కే పరిమితమైంది. గతం తో పోలిస్తే మన ఆర్చర్ల ప్రదర్శన మెరుగవ్వడం మాత్రం కాస్త ఊరట కలిగించే అంశం. టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో రిక్త హస్తాలే ఎదురయ్యా యి. మరి టీమ్ విభాగంలోనైనా మనోళ్లు మెరుస్తారా అన్నది చూడాలి. రోయింగ్, జూడో, షాట్‌ఫుట్ సహా మిగిలిన క్రీడల్లో మన అథ్లెట్లు ఫైనల్ చేరడంలో విఫలమయ్యారు. కనీసం మూడు పతకాలు సాధించామంటే అది షూటింగ్ వల్లే. మంచి అంచనాలతో బరిలోకి దిగి సంచలన ప్రదర్శనతో రెండు పతకాలు కొల్లగొట్టిన మనూ బాకర్ మూడో పతకాన్ని తృటిలో మిస్ చేసుకుంది. మిక్స్‌డ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్.. 50 మీ రైఫిల్ 3 పొజిషన్‌లో స్వప్నిల్ కుసాలే తొలి పతకం అందించాడు. 

ఆశలన్నీ వాళ్లపైనే

ఒలింపిక్స్‌లో ఇకపై ఆశలన్నీ ఇక నీరజ్ చోప్రా, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్‌పైనే నిలిచి ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి జావెలిన్‌లో ఏకంగా స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చిన నీరజ్ చోప్రాపై ఈసారి కూడా భారీ అంచనాలున్నాయి. కచ్చితంగా ఈసారి కూడా పసిడి సాధిస్తాడనే నమ్మకముంది. అందుకు తగ్గట్టుగానే ఒలింపిక్స్ కోసం తన అస్త్రశస్త్రాలను దాచుకున్నట్లు నీరజ్ పేర్కొన్నాడు. టోక్యో కంటే మెరుగైన ప్రదర్శన చేస్తానని నీరజ్ ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నాడు. విశ్వక్రీడల కోసం నీరజ్ చాలా ఈవెంట్లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తన పవర్ తెలుసుకునేందుకు గత ఏడాదిలో అతి తక్కువ ఈవెంట్స్‌లో మాత్రమే పాల్గొన్నాడు. 

ఇక ఆగస్టు 6న నీరజ్ చోప్రాతో పాటు మరో అథ్లెట్ కిషోర్ కుమార్ జెనా జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ పోటీల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 8న మెడల్ రౌండ్ జరగనుంది. గత ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రజతం నెగ్గిన మీరాబాయి చాను ఈసారి ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనేది ఆసక్తికరం. ఇక ప్రతీ ఒలింపిక్స్‌లో పతకం తెస్తున్న రెజ్లర్లపై ఈసారి కూడా మంచి అంచనాలున్నాయి. ముఖ్యం గా వినేశ్ ఫొగాట్, అంతిమ్ పంగల్‌పై భారీ ఆశలున్నాయి. ఈ ఇద్దరిలో కనీసం ఒక్కరైనా పతకం తీసుకొచ్చే అవకాశముంది. పురుషుల విభాగంలో అమన్ షెరావత్ ఒక్కడే ఉండడం.. అతడిపై కూడా మంచి అంచనాలున్నాయి. కోట్ల మంది ఆశలను నెరవేరుస్తూ ఈసారి ఒలింపిక్స్‌లో డబుల్ డిజిట్ పతకాలతో తిరిగిరావాలని ఆశిద్దాం.

పతకాల పట్టిక

దేశం స్వ కా మొత్తం

చైనా 16 11 9 36

ఫ్రాన్స్ 12 14 15 41

ఆస్ట్రేలియా 12 7 5 24

అమెరికా 11 20 20 51

బ్రిటన్ 10 10 12 32

భారత్ 0 0 3 3

నోట్: స్వ-స్వర్ణం, ర-రజతం, కా-కాంస్యం

నేడు ఒలింపిక్స్‌లో భారతీయం

బాక్సింగ్: మహిళల 75 కిలోల క్వార్టర్‌ఫైనల్స్: లవ్లీనా బొర్గోహెయిన్ x లి కియాన్ (చైనా)

బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్: లక్ష్యసేన్ x విక్టర్ (డెన్మార్క్)

షూటింగ్: పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్  పిస్టల్ క్వాలిఫికేషన్- స్టేజ్ 1: విజయ్‌వీర్ సిధు, అనీష్ 

మహిళల స్కీట్ క్వాలిఫికేషన్: రైజా డిల్లాన్, మహేశ్వరీ చౌహన్

హాకీ: పురుషుల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ భారత్ x గ్రేట్ బ్రిటన్ 

అథ్లెటిక్స్: మహిళల 3000 మీటర్ల స్టీపిల్ చేజ్ రౌండ్ 1: పారుల్ చౌదరి

పురుషుల లాంగ్ జంప్ : జెస్విన్ అల్డ్రిన్

సెయిలింగ్: పురుషుల డింగీ రేస్ 7, 8: విష్ణుశరవణన్

మహిళల డింగీ రేస్ 7, 8: నేత్ర కుమానన్

గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే: శుభాంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్