calender_icon.png 13 January, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదాలను నివారించలేమా?

12-07-2024 12:00:00 AM

మన దేశంలో అగ్ని ప్రమాదాలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత లేకుండా పోతున్నది. కర్మాగారాలు,  కార్యాలయాలలో ఎక్కడ, ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా, అక్కడి లోపాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్స్ పెద్ద సమస్య అవుతున్నది. నియమ నిబంధనలు సరిగా అమలు చేయక పోవడమే మూల కారణంగా కనిపిస్తున్నది. ‘నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా’ మార్గదర్శకాలను చాలా అరుదుగా ఎక్కడో ఒకచోట మాత్రమే ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. నియంత్రణ సంస్థలు అగ్ని ప్రమాదాల ఆవశ్యకత గురించి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా వాటి అమలులో అధికారుల అలసత్వం, అవినీతి, వనరుల కొరత సమస్యలుగా మారుతున్నాయి.

దేశంలో అగ్నిమాపక సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. భవనాలకు ఫైర్ సేఫ్టీ ఆడిట్లు తప్పనిసరి చేయాలి. అవసరమైన మేరకు సమగ్ర సంస్కరణలు చేయాలి. అగ్ని ప్రమాదాల బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందేలా చూడాలి. దీర్ఘకాలంగా న్యాయస్థానాలలో పరిహారం కోసం కేసులు నడుస్తున్నాయే కానీ బాధితులకు సత్వరం న్యాయం జరుగుతున్నట్టు లేదు. అగ్ని భద్రతకు చురుకైన, కఠినమైన విధానాన్ని అవలంబించాల్సి ఉంది. అప్పుడే ఇలాంటి విషాద సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ రకంగా మన దేశం ప్రజల జీవితాలను, ఆస్తులను పరిరక్షించి ‘అగ్ని ప్రమాద రహితం’గా నిలుపడానికి ప్రజలందరు రాజీలేని సహకారం అందించాలి.

దండంరాజు రాంచందర్‌రావు, హైదరాబాద్