calender_icon.png 20 September, 2024 | 8:13 AM

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవ్వచ్చు

20-09-2024 02:34:03 AM

విడాకుల కేసులో భార్య పిటిషన్‌పై హైకోర్టు

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానంలో భర్త దాఖలు చేసిన విడాకుల కేసులో పెద్దపల్లిలో ఉన్న ఆయన భార్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావడానికి హైకోర్టు అనుమతించింది. హైదరాబాద్‌లో కేసు విచారణకు హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. విడాకులు ఇప్పించాలంటూ హైదరాబా ద్ కుటుంబ న్యాయస్థానంలోని కేసును పెద్దపల్లి కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలంటూ సుల్తానాబాద్‌కు చెందిన మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ పీ శ్రీసుధ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మహిళ 4 నెలల పసికందుతో 190 కిలోమీటర్ల ప్రయాణం చేయటం కష్టమని, అందువల్ల కేసును బదిలీ చేయాలని కోరారు. భర్త తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భర్త వెన్నునొప్పితో బాధపడు తున్నందున అంతదూరం ప్రయాణం శ్రేయస్కరం కాదని డాక్టర్లు సలహా ఇచ్చారని తెలిపారు. శాంతిని వర్సెస్ విజయ వెంకటేష్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కేసును బదిలీ చేయాల్సిన అవసరంలేదని అన్నారు.

ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి 4 నెలల పసికందుతో మహిళ ప్రయాణం కష్టమేనని, అదే సమయంలో వారి ప్రయాణ ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత భర్తకు లేనందున ఇరువురికీ అనుకూలంగా మహిళ విచారణకు హాజరుకావాల్సిన అవసరంలేదని, ఆమెను ప్రశ్నించాల్సినపుడు వీడియో కాన్ఫరెన్స్ లేదంటే అడ్వొకేట్ కమిషన్ ద్వారా చేయవచ్చని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.