calender_icon.png 13 December, 2024 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతించిన ధరల మంటలు

13-12-2024 12:11:06 AM

  • నవంబర్‌లో  5.48 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం
  • ఆహార పదార్థాల ధరలు తగ్గిన ఫలితం

న్యూఢిల్లీ: దేశంలో నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఈ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో  6.21 శాతంగా నమోదై ఆందోళన గురిచేయగా.. నవంబర్‌లో  మాత్రం 5.48  శాతానికి తగ్గింది. ఆర్బీఐ లక్షిత స్థాయిలోపే (6 శాతం) నమోదు కావడం గమనార్హం. ఆహార పదార్థాల ధరలు తగ్గడం, మరీ ముఖ్యంగా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతోనే రిటైల్ ధరలు దిగి వచ్చాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు గురువారం కేంద్ర గణాంక కార్యాలయం డేటాను విడుదల చేసింది.

ఎన్‌ఎస్‌ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 9.04 శాతానికి తగ్గింది. అక్టోబర్‌లో ఇది 10.87 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో 8.70 శాతంగా నమోదైంది. ముఖ్యంగా కూరగాయలు, పప్పులు, పంచదార, పండ్లు, కోడిగుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు తదితరాల ధరల్లో తగ్గుదల నమోదైందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది.

మరోవైపు జులై- ఆగస్టు మధ్య సగటున 3.6 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కాగా.. సెప్టెంబర్ ఇది 5.5 శాతానికి, అక్టోబర్‌లో  ఏకంగా 6.2 శాతానికి చేరడం ఆందోళన కలిగించింది. 2023 సెప్టెంబర్ తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఈ స్థాయికి చేరడం గమనార్హం. దీంతో ఇటీవల ఆర్బీఐ తన పరపతి విధాన సమీక్షలో ద్రవ్యోల్బణ అంచనాలను పూర్తి సంవత్సరానికి 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది.

క్షీణించిన  పారిశ్రామికోత్పత్తి

దేశంలో అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి నెమ్మదించింది. మైనింగ్, విద్యుత్, తయారీ రంగాల్లో కార్యకలాపాలు నెమ్మదించడంతో వృద్ధి 3.5 శాతంగా నమోదైంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా పారిశ్రామికోత్పత్తిని లెక్కిస్తారు. గతేడాది అక్టోబర్‌లో  పారిశ్రామికోత్పత్తి సూచీ వృద్ధి 11.9 శాతంగా నమోదు కావడం గమనార్హం.

అక్టోబర్ నెలలో తయారీ రంగం 4.1 శాతం వృద్ధి నమోదు అవ్వగా.. గతేడాది ఇదే సమయంలో ఈ వృద్ధి 10.6 శాతంగా ఉంది. మైనింగ్ కార్యకలాపాలు 0.9 శాతం వృద్ధి చెందగా.. విద్యుదుత్పత్తి 2 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్- అక్టోబర్ మధ్య ఐఐపీ 4 శాతం మేర వృద్ధి చెందగా.. గతేడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7 శాతంగా ఉంది.