calender_icon.png 21 September, 2024 | 1:52 AM

ఎన్నో ఏళ్ల తర్వాత ప్రశాంతంగా ఉంటున్నా

21-09-2024 12:09:34 AM

  1. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిలా ఉంటా

ఎమ్మెల్సీ కోదండరాం 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్ల తర్వాత తాను ప్రశాంతంగా జీవిస్తున్నానని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ. కోదండరాం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో వేధింపుల నుంచి తాత్కాలికంగా విరామం లభించిందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కోదండరాం ఎమ్మె ల్సీగా నియామకమైన సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో మింట్ కాంపౌండ్‌లోని కార్యాలయంలో శుక్రవారం ఆత్మీయ సత్కారం నిర్వహించారు. 1104 యూనియన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సాయిబాబా నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం కనీసం సమస్యలు వినడానికి సిద్ధంగా ఉండడం గొప్ప విషయం అన్నారు. రాష్ట్రంలో గత పాలకుల నిర్వాకం కారణంగా దాదాపు రూ. 60 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని ఇలాంటి పరిస్థితులకు దిగజార్చినా కూడా ఇంకా దబాయింపులు మానడం లేదని బీఆర్‌ఎస్ నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు వారధిలా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోదండరాం భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు అశ్వథామ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ సుధీర్, అదనపు ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, కోశాధికారి కే శ్రీనివాస్ రెడ్డి, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అధ్యక్షులు వేణు, రఘునందన్, జెన్‌కో, ట్రాన్స్‌కో నాయకులు రాజేందర్, తులసీరాం, వెంకన్న, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.