- తుది అంకానికి కాళేశ్వరంపై విచారణ
- నేడు ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు విచారణ
- మరో దఫా కమిషన్ గడువు పొడిగించే అవకాశం
హైదరాబాద్,జనవరి 20(విజయ క్రాంతి): కాళేశ్వరం కమిషన్ విచారణ వేగంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టుతో సం బంధం ఉన్న అధికారులను, ఇంజినీర్లను విచారణకు పిలిచిన కమిషన్ వారి నుంచి స్టేట్‌మెంట్స్ రికార్డు నమోదు చేసింది. ఇక కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.
విచారణలో వెల్లడైన పేర్ల ఆధారంగా గత ప్రభుత్వంలో అన్నీ తానై కాళేశ్వరం ప్రాజెక్టును నడిపించిన అప్పటి సీఎం కేసీఆర్‌ను త్వరలో కమిషన్ విచారణకు పిలుస్తారని తెలుస్తోంది. అయితే అంతకుముందుగానే, ఇప్పటివరకు జరిగిన విచారణకు సం బంధించిన వివరాలన్నింటినీ క్రోఢీకరించుకుని అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారించేందుకు కమిషన్ సిద్ధపడుతున్నట్లు సమాచారం.
విచారణలో ఎక్కడా లోటుపాట్లు ఉండకుండా పూర్తి ఆధారాలతో ప్రశ్నలను సిద్ధం చేసుకుని మరీ మాజీ సీఎంను ఓపెన్ కోర్టుకు పిలుస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే 70శాతం పూర్తి..
ఇప్పటికే అనేకమార్లు పొడిగిస్తూ వచ్చిన కాళేశ్వరం కమిషన్.. ఈసారి సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లు ఎప్పటికప్పుడు విచారణ అంశాలను ప్రాథమిక నివేదిక రూపంలో సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే సుమారు 70 మందికి పైగా చేసిన విచారణ అంతా ప్రాథమికంగా ఓ నివేదిక రూపంలో సిద్ధమైందని, ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తు విచారణపై ప్రత్యేక దృష్టి సారించనుందని తెలుస్తోంది. మాజీ సీఎస్ ఎస్కే జోషిని గతంలో విచారణకు పిలిచినా.. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు మరోసారి కమిషన్ ఓపెన్ కోర్టుకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
తుది నివేదిక రూపకల్పనపై దృష్టి?
గతేడాది మార్చి 14న ప్రారంభమైన పీసీ ఘోష్ కమిషన్ మొదట రెండున్నర నెలల వరకు గడువుగా నిర్ణయించినా.. 4సార్లు ప్రభు త్వం గడువు పెంచుతూ వచ్చింది. గతేడాది డిసెంబర్ 31తో గడువు పూర్తయ్యేలోగానే మరోసారి ఫిబ్రవరి చివరి వరకు గడువును పెంచుతూ సర్కారు ఆదేశాలు ఇచ్చింది.
ప్రస్తుత విచారణ ఫిబ్రవరి చివరి నాటికి అధికారులు, కంపెనీల ప్రతినిధులను విచారించి.. ఆ తర్వాత మార్చిలో గత ప్రభుత్వ పెద్దలను విచారిస్తారని తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా తుది నివేదిక రూపకల్పనపై కమిషన్ దృష్టి సారించినట్లు సమా చారం. ఆలస్యం చేసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటివరకు ఫైనా న్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై విచారణను కమిషన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన విచారణ ద్వారా నిబంధనలు పాటించకుండా నిధులు విడుదల చేసినట్లు గుర్తించింది. నిబంధనలు పాటించని అధికారులపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.
హరీశ్, ఈటల సైతం..
కేసీఆర్ విచారణ తర్వాత గత ప్రభుత్వంలో సాగునీరు, ఆర్థిక శాఖల మంత్రిగా ఉన్న హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను సైతం విచారిస్తారని సమాచారం. వీరితోపాటు గతంలో విచారించిన సీనియర్ ఐఏఎస్‌లను మరోసారి విచారిస్తారని వినికిడి.
మంగళవారం నాటి విచారణకు ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు హాజరుకానున్నారు. ఈ దఫా విచారణకు మొదట కాగ్ అధికారులను సైతం పిలవాలని భావించినా.. వారి నుంచి పూర్తి నివేదిక రావడంతో దాన్నే ఆధారంగా కమిషన్ స్వీకరించిందని, వారిని విచారణకు పిలవబోరని సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టిన కంపెనీల ప్రతినిధులను కూడా ఈ సారి విచారణకు పిలవనున్నారని తెలుస్తోం ది. వీరితోపాటు సాగునీటి రంగ నిపుణుడు, బీఆర్‌ఎస్ నేత వీ ప్రకాశ్‌ను సైతం విచారణ కు పిలిచినట్లుగా సమాచారం. మాజీ ఈఎన్‌సీని మరొక్కసారి బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది.