calender_icon.png 16 November, 2024 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బర్త్‌డే పార్టీకి పిలిచి ప్రాణం తీశారు!

16-11-2024 12:34:03 AM

దాడిచేసి చంపిన స్నేహితుడు

రాజేంద్రనగర్, నవంబర్15: బర్త్‌డే పార్టీ అంటూ పిలిచి స్నేహితుడే ప్రాణం తీశాడు. ఈ ఘటన నార్సింగి పీఎస్ పరిధిలోని అల్కపురికాలనీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి కథనం ప్రకారం.. తెల్లవారుజామున 3.17 గంటలకు డయల్ 100కు కాల్‌రావడంతో పోలీసులు నార్సింగి పీఎస్ పరిధిలోని అల్కపురి కాలనీకి చేరుకున్నారు.

రోడ్‌నంబర్ 30 సమీపంలో ఆరో ప్రైడ్ అపార్ట్‌మెంట్ ముందు ఓ యువకుడు తీవ్రగాయాలతో రక్తస్రావమై పడిఉన్నాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. అతడి జేబులో ఉన్న సెల్‌ఫోన్, ఇతర ఆధారాల ద్వారా అతడిని బాలానగర్ ప్రాంతానికి చెందిన రోహిత్ కుమార్ సింగ్(25)గా గుర్తించారు. పదునైన ఆయధంతో రోహిత్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉండగా, అక్బర్ అనే యువకుడు స్నేహితుడైన రోహిత్‌తోపాటు మరికొందరిని తన పుట్టినరోజు వేడుకలకు పిలిచినట్లు తెలుస్తోంది. మద్యం తాగిన తర్వాత అక్బర్ రోహిత్‌పై దాడి చేసినట్లు సమాచారం. పోలీసులు అతడితోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.