24-02-2025 07:18:13 PM
భద్రాచలం (విజయక్రాంతి): సిపిఎం పార్టీని బలోపేతం చేయడమే అమర జీవి కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావుకు మనం ఇచ్చే ఘన నివాళి అని సిపిఎం సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవికుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డిలు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ మాజీ కార్యదర్శి వర్గ సభ్యులు అమరజీవి కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావు 9వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ముందుగా ముదిగొండ చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు జి.ఎస్. శంకర్రావు, బిబిజి తిలక్ లు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ... కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావు నిత్యం ప్రజా సమస్యలపై పనిచేసేవారని, ప్రజలలో తలలో నాలికల ఉండేవారని అన్నారు. ఆనాడు ప్రజాశక్తి పత్రికను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకు మంచి కృషి చేసేవారని అన్నారు.
నేడు దేశంలో విలువలు లేని రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రజలపై భారాలు మోపి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని అన్నారు. రోజురోజుకు పేదరికం, నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందుతుందని అన్నారు. రానున్న కాలంలో ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని అదే అమరజీవి కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావుకు మనమిచ్చే నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు డి రాఘవయ్య, ఎస్ భూపేంద్ర, ఎస్ డి ఫిరోజ్, సీనియర్ నాయకులు ఎం.వి.ఎస్ నారాయణ, మురళీకృష్ణ, జి రాధా, కుటుంబ సభ్యులు ధనలక్ష్మి, రాము తదితరులు పాల్గొన్నారు.