calender_icon.png 10 January, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాలెండర్ సరే.. ఖాళీలెన్ని?

23-07-2024 12:56:13 AM

అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనున్న రేవంత్ సర్కార్

ఉద్యోగ ఖాళీలను తెలుపకుండానే ప్రకటన చేసే యోచన

యూపీఎస్సీ తరహాలోనే రూపకల్పన!

* ‘త్వరలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నాం. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి, జూన్ 2న నోటిఫికేషన్లు ఇచ్చి, డిసెంబర్ 9లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకొస్తున్నాం’.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల జేఎన్టీయూలో జరిగిన ఓ సమావేశంలో చేసిన ప్రకటన ఇది. ఇదే ప్రకటనను ఆయన మరికొన్ని వేదికలపై కూడా చేశారు.

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): మంగళవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది. అయితే యూపీఎస్సీ తరహా లోనే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించేం దుకు రంగం సిద్ధం చేసింది. నోటిఫికేషన్‌లలో ఉద్యోగ ఖాళీలను ప్రకటించకుం డానే కేవలం జాబ్ క్యాలెండర్ ప్రకటననే చేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వేస్తారో? అనే వివరాలతోనే ప్రభుత్వం సరిపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఖాళీల వివరాలు లేకుండానే..

గత ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు వెలువడలేదనే భావనతో నిరుద్యోగులు, యువత  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను జారీచేస్తుందని భావించారు. కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అయితే గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు గ్రూప్ డీఎస్సీలో పోస్టులు పెంచాలని, పరీక్షలను వాయిదా వేయాలని పెద్దఎత్తున ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుద్యోగులను శాంతింపజేసేందుకు జాబ్ క్యాలెం డర్‌ను అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెప్పు కోవాల్సి వస్తోంది. అయితే ఈ జాబ్ క్యాలెండర్‌లో ఏ నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టులు ఉంటాయో ముందస్తుగా ప్రకటించడం లేదని తెలుస్తోంది. 

నోటిఫికేషన్ల వివరాలు మాత్రమే!

జాబ్ క్యాలెండర్‌లో కేవలం నోటిఫికేషన్ల వివరాలు మాత్రమే ఉండనున్నట్లు తెలిసింది. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) జాబ్ క్యాలెండర్‌ను దాదాపుగా ఈ క్యాలెండర్ పోలి ఉండనుంది. యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్‌లో ఏ విధంగానైతే వరుసగా భర్తీ చేసే ఉద్యోగాల పేర్లు, నోటిఫికేషన్ వెలువడే తేదీ, దరఖాస్తుల స్వీకరణ గడువు, పరీక్షల ప్రారంభ తేదీ, ఎన్ని రోజులు పరీక్షలు నిర్వహిస్తారో లాంటి వివరాలు ఉంటాయి. ఎన్ని పోస్టులను భర్తీ చేయబోతోందనేది మాత్రం నోటిఫికేషన్ రోజే ప్రకటిస్తుంది.. ముందుగా ప్రకటించదు. ఈ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించబోతోంది. ముందస్తుగా ఇన్ని వేల ఖాళీలతో నోటిఫికేషన్‌ను వేయబోతున్నట్లు వెల్లడించరు. 

గత ప్రభుత్వాలు ఏ నోటిఫికేషన్‌ను జారీ చేసినా ఇన్ని వేల పోస్టులను భర్తీ చేయబోతున్నామని ప్రకటించేవి. ఇకమీదట ఖాళీల వివరాలను ప్రకటించకుండా ఎప్పుడు, ఏ నెలలో, ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తామో, పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో మాత్రమే చెప్పనున్నారు. ఈ తరహా ప్రకటిండానికి కూడా ఓ కారణం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మళ్లీ పోస్టులను కలపాలనే డిమాండ్ నిరుద్యోగుల నుంచి రాదు. పరీక్షలు కూడా మాటిమాటికి వాయిదా వేయకుండా అనుకున్న తేదీల్లో నిర్వహించి భర్తీ ప్రక్రియను డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నోటిఫికేషన్ తేదీ వరకు ఎన్ని ఖాళీలుంటాయో వాటితోనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలిసింది. నిరుద్యోగుల డిమాండ్ మేరకు గత గ్రూప్ నోటిఫికేషన్‌లో 60 పోస్టులను, డీఎస్సీలో దాదాపు 6 వేల పోస్టులను కలిపిన విషయం తెలిసిందే. 

సుమారు 50 వేల ఖాళీలు..

ఆయా శాఖల్లో మొత్తం సుమారు 30 వేల నుంచి 50 వేల వరకు ఖాళీలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం డీఎ స్సీ, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్ 2, 3, 4తోపాటు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్, గురుకుల బోర్డు, వైద్యారోగ్యశాఖ తదితర శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్‌ను రూపొందించినట్లుగా తెలిసింది. ఉదాహరణకు గ్రూప్ ను ఇన్ని వేల పోస్టులతో నోటిఫికేషన్‌ను జారీ చేస్తున్నట్లు, డీఎస్సీని ఇన్ని వేల పోస్టులతో భర్తీ చేయబోతున్నట్లు జాబ్ క్యాలెండర్‌లో ప్రకటిం చడంలేదని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది.

యూపీఎస్సీ-2025 జాబ్ క్యాలెండర్ నమూనా ఇలా...

నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ తేదీ దరఖాస్తులకు చివరితేది పరీక్షల తేదీ పరీక్షల వ్యవధి

కంబైన్డ్ జీయో సైంటిస్ట్ ప్రిలిమినరీ 04.09.2024 24.09.2024 09.02.2025 ఒక రోజు

ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ 18.09.2024 08.10.2024 09.02.2025 ఒక రోజు

సీబీఐ (డీఎస్పీ) ఎల్‌డీసీఈ 27.11.2024 17.12.2024 08.03.2025 రెండు రోజులు

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష,

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ 22.01.2025 11.02.2025 25.05.2025 ఒక రోజు