calender_icon.png 22 December, 2024 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేయూలో లెక్కలు తేలుతున్నయ్!

13-09-2024 12:22:39 AM

  • పండిన ‘భూ’బకాసురుల పాపం!
  • విజిలెన్స్, రెవెన్యూశాఖల సర్వేలో కబ్జా నిజమేనని రూఢీ
  • కబ్జాదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ అధికారులు
  • వెన్నులో వణుకుతో హైకోర్టుకు.. ‘స్టే’కి నిరాకరించిన న్యాయస్థానం

హనుమకొండ, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగి భూ ఆక్రమణల వ్యవహారంలో తవ్వినకొద్దీ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూశాఖలు సంయుక్తంగా సర్వే నెంబర్ -229 లో చేపడుతున్న సర్వేలో విస్తుపోయే అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న వర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్‌బాబు సహా తొమ్మిది మంది ఆక్రమణదారులు ఇటీవల హైకోర్టును సైతం ఆశ్రయించారు.

ఈ కేసుపై స్టే ఇచ్చేందుకు గురువారం న్యాయస్థానం నిరాకరించిం ది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆక్రమణదారుల్లో వణుకు మొదలైంది. అక్రమార్కుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ అధికారులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమాలపై పూర్తి స్పష్టత రావడానికి మరికొద్ది రోజులు పడుతుందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఆక్రమిత స్థలాల్లో నిర్మించిన ఇళ్లకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక కూల్చివేతలే తరువాయి అనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది.

యూనివర్సిటీ భూముల కబ్జా?

వర్సిటీకి పలు సర్వే నెంబర్లలో సుమారు 673.12 ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 1967లో నాటి ప్రభుత్వం వర్సిటీ ఏర్పాటుకు పలివేల్పుల శివారు గ్రామాల నుంచి 175. 14 ఎకరాలు, లష్కర్ సింగారం శివారు నుంచి 309. 20 ఎకరాలు, కుమార్‌పల్లి శివారు గ్రామాల నుంచి 188.28 ఎకరాల భూమిని సేకరించింది. అప్పట్లో వర్సిటీ అధికారులు భూమికి సరైన సరిహద్దులు ఏర్పాటు చేయని కారణంగా కాలక్రమంలో కొంతభూమి ఆక్రమణకు గురైంది. అవి పోగా ప్రస్తుతం వర్సిటీ పరిధిలో 622.20 ఎకరాల భూమి మిగిలింది. అంటే 50 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు తేలిపోయింది. 2021 వర్సిటీ భూములు ఆక్రమణకు గురయ్యాయనే ఆందోళన ప్రారంభమైంది.

మాజీ వీసీల అలసత్వం?

వర్సిటీ భూముల ఆక్రమణల ఉచ్చు మాజీ వీసీలకు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. వారి హయాంలోనే అనేక అక్రమాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కబ్జాదారులకు వారు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలపై వర్సిటీ అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఇస్తారితో పాటు పలు విద్యార్థి సంఘాలు ఆధారాలతో సహా అప్పటి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. దీంతో నాటి కలెక్టర్, ఆర్డీవో స్పందించి వర్సిటీ భూములపై సర్వే నిర్వహించారు. సర్వేలో కుమార్‌పల్లి, లష్కర్‌సింగారం, పలివేల్పుల గ్రామ శివారులోని సుమారు 50 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. నాడు వీసీలుగా ఉన్న వారు ఆక్రమణలపై సరైన విధంగా స్పందించ లేదనే విమర్శలు ఉన్నాయి. అప్పుడే వారు స్పందించి ఉంటే పరిస్థితులు ఇక్కడి వరకు వచ్చేవి కావనే అభిప్రాయడం అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నుంచి వ్యక్తమవుతున్నది.