calender_icon.png 11 October, 2024 | 2:59 PM

పొంతన కుదరని క్వార్టర్ల లెక్క !

04-09-2024 12:11:48 AM

  1. స.హ. చట్టంలో ఇచ్చిన వివరాలు ఒకలా.. 
  2. ఇన్‌చార్జి జీఎం చెప్పిన వివరాలు మరోలా? 
  3. తప్పుదోవ పట్టిస్తున్న సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా యాజమాన్యం 
  4. గతంలోనే బయటపెట్టిన ‘విజయక్రాంతి’

మంచిర్యాల, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో క్వార్టర్ల కేటాయింపు అక్రమాలపై ‘విజయక్రాంతి’ ప్రచురించిన కథనాలు నిజమేనని బహిర్గతమవుతున్నది. గతంలో స.హ.చట్టం కింద ఇచ్చిన క్వార్టర్ల వివరాలు, తాజాగా శ్రీరాంపూర్ ఏరియా ఇన్‌చార్జి జీఎం వెల్లడించిన క్వార్టర్ల  వివరాలకు పొంతన కుదరక పోవడం ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో క్వార్టర్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని ‘విజయక్రాంతి’లో ఆగస్టు 11న ‘సింగరేణి క్వార్టర్స్‌లో బయటివ్యక్తులు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. వెంటనే స్పందించాల్సిన అధికారులు ఆలస్యంగా మే ల్కొన్నారు. మంగళవారం ఇన్‌చార్జి జీఎం శ్రీనివాస్ స్పందిస్తూ.. 345 క్వార్టర్లలో ప్ర స్తుతం కార్మికేతరులకు 228 క్వార్టర్లు మా త్రమే అలాట్ చేశామని ప్రకటించారు.

అందులో ప్రభుత్వ విభాగాల (న్యాయ, పోలీసు, రెవెన్యూ, పోస్టల్, బ్యాంకు) ఉద్యోగులు 88 మంది అని, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి 66, పాలిటెక్నిక్ ఉద్యోగులకు 19, పాలిటెక్నిక్ కళాశాల బాలికల హాస్టల్‌కు 32, సింగరేణి ఉన్నత పాఠశాల ఉద్యోగులకు 21, సింగరేణి సేవా సమితికి రెండు క్వార్టర్లను సంబంధిత శాఖల అభ్యర్థన మేరకు సింగరేణి సంస్థ పైఅధికారుల అనుమతితో అలాట్ చేసిందని స్పష్టంచేశారు. అలాగే 59 క్వార్టర్లలో అనధికారికంగా సింగరేణేతరులు ఉంటున్న విషయం గమనించి ఆయా క్వార్టర్లకు నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేశామని చెప్పారు. వాటిని ఖాళీ చేయించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు.

క్వార్టర్లకు అద్దె చెల్లించని వారికి నోటీసులు కూడా ఇచ్చామని వెల్లడించారు. ఆగస్టు 23న ప్రచురితమైన ‘సింగరేణి క్వార్టర్స్‌లో అధికారుల పాగా’ కథనానికి స్పందించిన ఇన్‌చార్జి జీఎం.. సంస్థ కేటాయించిన క్వార్టర్లలోనే ఉద్యోగులుంటున్నారని తెలిపారు. ఇటీవల క్వార్టర్స్ కౌన్సిలింగ్‌లో అధికారులు, ఉద్యోగులు బెటర్మెంటు క్వార్టర్ కోసం దరఖాస్తు చేసుకొన్నారని.. వేరే క్వార్టర్లు రిపేరు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రిపేరు కాకపోవడంతో వారి పేరిట రెండు క్వార్టర్లు కనిపిస్తున్నాయని చెప్పారు. రెండేసి క్వార్టర్లు కనిపిస్తున్న 67 మంది హెచ్‌వోడీలకు లేఖ జారీ చేసి పీనల్ రెంట్ కట్ చేస్తామని తెలిపారు.  

స.హ. చట్టంలో మరోలా..  

సింగరేణి శ్రీరాంపూర్ ఇన్‌చార్జి జీఎం శ్రీనివాస్ తెలిపిన వివరాలకు.. శ్రీరాంపూర్ ఏరియా డీవైజీఎం సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాచారానికి పొంతన కుదరట్లేదు. ఎవరు చెప్పేది కరెక్టో.. ఎవరు చెప్పేది తప్పుడు సమాచారమో అర్థం కావట్లేదు. సంబంధిత శాఖ అధికారి 345 క్వార్టర్లను సింగరేణి సంస్థ అధికారులు, కార్మికులకు కాకుండా ఇతర వ్యక్తులకు కేటాయి ంచినట్టు సమాచారం ఇచ్చారు. ఇన్‌చార్జి జీఎం మాత్రం కార్మికేతరులకు 228 క్వార్టర్లు మాత్రమే అలాట్ చేశామని, 345 కాదు అని చెప్తున్నారు. ఎవరు చెప్పేది నిజమో వారికే తెలియాలి. సింగరేణి సంస్థలో కిందిస్థాయి అధికారులు జీఎంస్థాయి అధికారు లను తప్పుదోవ పట్టిస్తున్నారా? అన్న సందేహం కల్గుతోంది.