- కాంగ్రెస్ పార్టీలో ఏకపక్ష నిర్ణయాలపై అభ్యంతరం
- నామినేటెడ్ పోస్టులకు సిఫార్సులు, ప్రభుత్వంలో జోక్యంపై ఆరోపణలు
- ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శులను పట్టించుకోవడం లేదనే విమర్శ
- అధిష్ఠానానికి ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ తీరుపై పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. పార్టీకి, నాయకత్వానికి వారధిలా ఉంటూ, అంతర్గత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన మున్షీ ఏకపక్ష నిర్ణయాలు తీసు కుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గాంధీభవన్ వర్గాల్లో ఇప్పుడీ అంశంపై చర్చోచ ర్చలు సాగుతున్నట్లు సమాచారం. మున్షీ నచ్చిన వారిని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని సిఫార్సులు చెస్తున్నారని, ప్రభుత్వంలోనూ ఆమె జోక్యం ఎక్కువైందనే ప్రచా రం జరుగుతున్నది. ముఖ్యంగా ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శులు ఆమె వ్యవహార శైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ మంచి చెడులు, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి చేరవేసేందుకే తాము నియమితులమ య్యామని, కానీ.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో తమ ప్రాధాన్యం తగ్గింపోయిందని ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శులు వాపోతున్నట్లు తెలిసింది.
పార్టీలో మొదటి నుంచి ఉండి, పార్టీ కోసం పని చేసేవారిని కాకుండా, కొత్తగా వచ్చిన వారి పేర్లను నామినేటెడ్ పోస్టులకు సిఫారస్ చేస్తున్నారని, ముఖ్యమైన పదవుల నూ వారికే కట్టబెడుతున్నారని క్యాడర్ పెదవి విరస్తున్నట్లు సమచారం.
కారణాలు ఇవేనా ?
ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శులుగా కేరళకు చెందిన విశ్వనాథ్, తమిళనాడుకు చెందిన విశ్వనాథం వ్యవహరిస్తున్నారు. అధిష్ఠానం వీరిలో ఒకరికి ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలు, మరొకరికి ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ బాధ్యతలు అప్పగించింది. వీరు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ సూచించిన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నది.
పార్టీ కోసం కష్టపడుతూ, నిబద్ధతతో పనిచేసే వారి జాబితాను అధిష్ఠానానికి అందజేయాల్సి ఉంటుంది. కానీ.. దీపాదాస్ మున్షీ వ్యవహారశైలి అలా లేదని, ఆమె తీరుకు విసిగి వేసారిన ఇద్దరు ఇన్‌చార్జ్ ఏఐసీసీ కార్యదర్శలు అసలు రాష్ట్రానికి రావడమే మానేశారనే చర్చ నడుస్తున్నది.
మున్షీ మాత్రం హైదరాబాద్‌లోనే తిష్టవేసి కాంగ్రెస్ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారని పార్టీకి చెందిన ఓసీనియర్ నేత వెల్లడించాడు. ఆమె తీరుపై ఇప్పటికే అధిష్ఠానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
పాత టీంను పక్కన పెట్టి..
తెలంగాణలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మాణిక్యం ఠాగూర్, ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్‌రావు ఠాక్రే బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శులుగా బోసురాజ్, శ్రీనివాస్ కృష్ణన్, రోహిత్ చౌదరి నియమితులయ్యారు.
ఒక్కో ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శికి అధిష్ఠానం ఐదు నుంచి ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ టీమ్ కీలకంగా పని చేసింది. పార్టీ కార్యక్రమాలను విస్తృత పరిచి, ఎన్నికల్లో విజయానికి దోహదం చేసింది.
పార్టీ అధికారంలోకి వచ్చాక పాత టీంను అధిష్ఠానం పక్కన పెట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మున్షీ బాధ్యతలు అప్పగించిందనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచే క్యాడర్‌లో అసంతృప్తి మొదలైందనే విమర్శలు ఉన్నాయి.