కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు సీఎండీ ఆదేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): నగరంలోని విద్యుత్తు స్తంభా లపై పెద్ద ఎత్తున వేలాడుతున్న కేబుల్స్‌ను తక్షణమే తొలగించాలని ఎస్పీడీసీఎల్ సీఎం డీ ముషారఫ్ ఫరూఖీ అన్నారు. మింట్ కాంపౌండ్‌లోని కార్పొరేట్ కార్యాలయంలో కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్‌తో సీఎండీ బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరెంటు స్తంభాలపై కెపాసిటీకి మించి టెలికాం పరికరాలు, కేబుల్ బండిల్స్ ఉండడం వల్ల అదనపు భారం పడుతూ పోల్స్ వంగిపోతూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.
ఇటీవల తాము జరిపిన ఫీడర్స్ సర్వేలో ఉప యోగంలో లేని కేబుల్స్ గుట్టలు గుట్టలుగా ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. పోల్స్ అన్ని కేబుల్స్‌తో చుట్టి ఉండడం వల్ల విద్యుత్తు సిబ్బంది మరమ్మతులు చేపడుతున్న సమయంలో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్లు కే రాములు, సుధారాణి, జోనల్ చీఫ్ ఇంజినీర్లు సాయిబాబా, నరసింహ స్వామి, బిక్షపతి, పీ ఆనంద్, సీవీవో నారాయణ, కేబుల్ సంఘాలు, ఇంటర్నెట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.