- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ సీఎస్
- త్వరలో ఉద్యోగ సంఘాలతో భేటీ
- తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతల హర్షం
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్రప్రభుత్వం గతంలోనే క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ మేరకు శుక్రవారం సీఎస్ శాంతికుమారి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏలు, బిల్లులు, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు, పెన్షనర్ల కాంట్రీబ్యూషన్‌తో ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), 317 జీవో వంటి 60 వరకు సమస్యలున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నది.
డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ సైతం ప్రకటించింది. దీంతో సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 24న రాష్ట్రప్రభుత్వం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తు న్నట్లు ప్రకటించింది. సబ్‌కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క కాగా, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఉన్నారు.
ఒక ప్రభుత్వ కార్యదర్శి ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా నియమితులు కానున్నారు. ఈ కమిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది.
అలాగే కమిటీ త్వరలో ఉద్యోగ సంఘాలతో విడతల వారీగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సమావేశాలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, వివిధ ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు సమాచారం.
సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను రాష్ట్రప్రభుత్వం సత్వరం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. సర్కార్ కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కమిటీ త్వరితగతిన సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు.