పలు కీలక అంశాలపై నిర్ణయాలు
కాళేశ్వరం మరమ్మతులపై సమాలోచనలు
పునర్విభజన అంశాలపై లోతుగా చర్చించే అవకాశం
రైతు రుణమాఫీకి నిధుల సమీకరణపైనా..
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల హడావుడి ముగిసిన నేపథ్యంలో నేడు నిర్వహించనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలకమైన పలు అంశాలపై లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం మధ్యాహ్నం సచివాలయంలో జరుగనుంది. ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించనుంది.
కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు చేయాల్సిన మరమ్మతులపై నిర్ణయం తీసుకోనున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నుంచి వచ్చిన మధ్యంతర నివేదికను, అందులో వారు సూచించిన పనులను మంత్రివర్గం చర్చించనుంది. వర్షాకాలం సీజన్ తరుముకొస్తున్న నేపథ్యంలో ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సులను అనుసరించి ఎలాంటి మరమ్మతు పనులను చేపట్టవచ్చు? అలాగే ప్రభుత్వం, నిర్మాణ సంస్థల్లో ఎవరు ఖర్చు పెట్టాలనే అంశాలపైనా సమాలోచనలు చేయనుంది.
రుణమాఫీకి వనరుల సేకరణ
ఆగస్టు 15 లోపు రూ.2 లక్షలలోపు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ, సీఎం స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. అసలు రైతు రుణమాఫీకి సంబంధించి ఎంత మొత్తం అవసరం? ఆయా ఆర్థిక వనరులను ఎక్కడి నుంచి సమీకరించాలి? ఇందుకు కావాల్సిన మార్గదర్శకాలు, అవకాశాలపై మంత్రివర్గం చర్చించనుంది. మిగతా అంశాలతో పోలి స్తే ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో రైతు రుణమాఫీకి ఆర్థిక వనరుల సమీకరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రం ఏర్పడి పదేండ్లు..
జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి కానుంది. పునర్విభజన చట్టం ప్రకారం పదేండ్ల తరువాత ఏపీ అజమాయిషీ ఎందులోనూ ఉండదు. ఈ నేపథ్యంలో పదేండ్లు అవుతున్నా ఏపీతో తకరారు ఉన్న అంశాలను లోతుగా కేబినెట్ చర్చించనుంది. అలాగే తెలంగాణ, ఏపీ మధ్యన ఇంకా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కీలక అంశాలతో పాటు ధాన్యం కొనుగోళ్లు, తడిసిన ధాన్యం, పంటనష్టం పరిహారం తదితర అంశాలపైనా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా చర్చించనున్నారు.
దీనితో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇందుకు ఎలాంటి తీసుకురావాల్సిన సంస్కరణలు అవసరం ఉందనేదానిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలను నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలను నిర్వహణ అంశం చర్చకు రానుంది. అలాగే జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది.
పాఠశాలలు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ తదితర అంశాలను ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. వీటితోపాటు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక వనరులు, పెండింగులో ఉన్న సమస్యలనుకూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.