- సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్త రేషన్‌కార్డుల జారీపై చర్చ
- ఎస్సీ వర్గీకరణ, రైతుభరోసా, భూమిలేని పేదలకు ఆర్థిక సాయంపైనా..
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సచివాలయ ఈ నెల 4న సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుతో పాటు ప్రధానంగా రైతుభరోసా, భూమి లేని పేదలకు నగదు బదిలీ, అర్హుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించనున్నట్లు సమాచారం.
భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్‌లోనే పథకం అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల వంటి కీలక అంశాలపైనా మంత్రి వర్గం చర్చించనున్నట్లు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంపు, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ అమలుకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కమిషన్ వినతులు, ఆయా కమిషన్లు అందించే నివేదికలపైనా చర్చ సాగనున్నది.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సబ్సిడీపై ఇసుక, సిమెంట్ , స్టీలు తదితర ముడి సరుకుల సరఫరా, టూరిజం పాలసీపై మంత్రివర్గం చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని తెలిసింది. టూరిజం పాలసీపై ఇప్పటికే జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చ జరిగింది. క్యాబినెట్ సమావేశం తర్వాత పాలసీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
టీటీడీ తరహాలో యాదాద్రి బోర్డు.. ?
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయ పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) బోర్డు తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలిసింది. 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఆలయానికి పాలక మండలిని నియమించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా పాలకమండలి, బోర్డు అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇంకా ఆలయ పరిధిలోనే ఎన్నో అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.