calender_icon.png 26 October, 2024 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రివర్గం భేటీ సాయంత్రం 4 గంటలకు

26-10-2024 02:28:19 AM

  1. బీసీ కులగణన, స్పోర్ట్స్ పాలసీ  
  2. వీఆర్‌ఏ, వీఆర్‌ఓల వ్యవస్థ సహా పలు అంశాలపై చర్చ!

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ శనివారం సచివాలయంలో భేటీ కానుంది. ఈ మంత్రి మండలి సమావేశంలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

ముఖ్యంగా బీసీ కులగణన, ఉద్యోగులకు ఇచ్చే డీఏలు, స్పోర్ట్స్ పాలసీ, 317 జీవోతో పాటు మూసీ, సన్న వడ్లకు బోనస్, ధరణి, వీఆర్‌ఏ, వీఆర్‌ఓల అంశం, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, మామునూరు ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ .. వంటి పలు కీలక అంశాలు ఎజెండాలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సాయంత్రం నాలుగు గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏపై క్యాబినెట్‌లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎన్ని డీఏలు ఇవ్వాలన్న దానిపై ఈ భేటీలో ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. అలాగే, 317 జీవోపై సబ్ కమిటీ ఇప్పటికే నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది.

దీనిపై కూడా మంత్రిమండలి చర్చించనున్నట్లు సమాచారం. స్పోర్ట్స్ పాలసీని వీలైనంత త్వరగా తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ అంశంపై ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మిల్లర్లకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ నిబంధన పెట్టాలని చూస్తోంది.

దీన్ని మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీ నిబంధన పెట్టకపోతే జవాబుదారీతనం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకు గ్యారంటీపై క్యాబినెట్‌లో కీలక నిర్ణయం వెలువడనుంది. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఇటీవల ప్రభుత్వం ఎన్‌ఐసీకి అప్పగించింది. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

రాష్ట్రంలో ఈసారి 50లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్ల దిగిబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సీజన్ నుంచి సర్కారు సన్న వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఈ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీసీ కులగణనపై కూడా చర్చించే అవకాశం ఉంది.

ఈ నెల 28 నుంచి బీసీ కులగణనపై బహిరంగ విచారణ జరగనుంది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు పోవాలన్న దానిపై చర్చించనున్నట్లు సమాచారం. మూసీ పునరుజ్జీవం విషయంపై మీటింగ్‌లో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే మూసీ పునరుజ్జీవానికి సంబంధించి డీపీఆర్‌ను రూపొందించే బాధ్యతలను ఐదు సంస్థలతో కూడా కన్షార్షియంకు ప్రభుత్వం అప్పగించింది.  రూ.2లక్షల లోపు రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రూ.2లక్షల పైన ఉన్న రుణాల మొత్తం రూ.13వేల కోట్లను ఇంకా మాఫీ చేయాల్సి ఉంది. అలాగే, వీఆర్‌ఏ, వీఆర్‌ఓ వ్యవస్థలను పునరుద్ధరించాలని ప్రభుత్వం చూస్తోంది.

ఈ క్రమంలో ఈ రెండు అంశాలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటు కూడా పూర్తయ్యింది. మామునూరు ఎయిర్‌పోర్టుకు అడ్డంకులు తొలగనున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం క్యాబినెట్‌లో చర్చించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.