calender_icon.png 15 October, 2024 | 11:49 AM

త్వరలో క్యాబినెట్ విస్తరణ

15-10-2024 01:18:58 AM

  1. 9 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం
  2. బీఆర్‌ఎస్ ఇచ్చింది 30 వేల ఉద్యోగాలే  
  3. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం
  4. రుణమాఫీకి సర్కారు కట్టుబడి ఉంది
  5. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

నిజామాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియగానే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఉంటుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9 నెలల కాలంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

కానీ పదేండ్లలో  బీఆర్‌ఎస్ కేవలం 30 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని, మ్యానిఫెస్టోలో లేని కార్యక్రమాలను సైతం తమ ప్రభుత్వం అమలు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు తెలిపారు.

సోమవారం నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. రైతుల రుణమాఫీకి సర్కారు పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గలేదన్నారు. రాష్ట్రానికి రూ. 7.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిందని చెప్పారు.

మిగితా వారికి సైతం రుణమాఫీ చేస్తుందని ఆయన తెలిపారు. రుణమాఫీ విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్చిన్నం చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రుణమాఫీ విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలని ఆయన హితవు పలికారు.  9 నెలల్లో చేసిన తాము చేసిన రుణమాఫీ ఎంత, పదేండ్లలో బీఆర్‌ఎస్  చేసిన రుణమాఫీ ఎంతో తెలుసుకోవా లని కేటీఆర్, హరీశ్ రావుకు సూచించారు.

 ప్రభుత్వంపై దుబాయి నుంచి దుష్ప్రచారం..

కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులపై బీఆర్‌ఎస్ నాయకులు  దుబాయి నుంచి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది కేటీఆర్, హరీశ్ రావులకు తాత్కాలిక ఆనందం ఇస్తుందేమో కావచ్చు కాని వారు దీర్ఘకాలంలో నష్టపోతారని, ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు, ప్రజలు మంచి చెడులు ఆలోచిస్తారని, వారు రెండు ప్రభుత్వాలను భేరీజు వేస్తారని మహేశ్ గౌడ్  పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలే నాయకత్వం వహిస్తరు..

రాష్ట్రంలో బాన్స్‌వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం మధ్య, పరకాలలో కొండా సురేఖ, రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య తగవుపై ఆయన స్పందించారు. తమ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్యేలే పార్టీకి నాయకత్వం వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.

చివరగాతమ పార్టీని, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. ఇరు నాయకుల మధ్య గొడవలు తలెత్తిన చోట జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు సమస్యను పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. జిల్లాకు దసరా కానుకగా యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ కళాశాల మంజూరు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

నిజామాబాద్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రాణహిత ప్రాజెక్టులోని 20, 21 ప్యాకేజీలను పూర్తి చేసి జిల్లాలో సాగు నీటిని అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. సమావేశంలో ఉర్డు అకాడమీ చైర్మన్ తాహేర్ పాల్గొన్నారు.