calender_icon.png 23 September, 2024 | 4:58 AM

దసరాకు మంత్రివర్గ విస్తరణ?

23-09-2024 02:48:44 AM

ఆరు బెర్తుల భర్తీకి అవకాశం 

ఆశావాహుల్లో ఉత్కంఠ 

హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం

సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, రాజగోపాల్‌రెడ్డికి ఖరార్ 

మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు అవకాశం 

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. దసరా పండుగ రోజున ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను భర్తీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. దీంతో మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డితో కలుపుకొని 12 మంది మంత్రులు ఉన్నారు.

రెండు, మూడు  ఉమ్మడి జిల్లాలకు ఇద్దరు, ముగ్గురు మంత్రులు ఉండగా.. నాలుగు జిల్లాలకు మంత్రి వర్గంలో మొత్తానికే ప్రాతినిధ్యం లేదు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా సీఎం, 17 మంది మంత్రులతో కలిపి మొత్తం 18 మందితో క్యాబినెట్ కూర్పు ఉండాలి. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేదు.

రెండో విడత క్యాబినేట్ కూర్పులో ప్రాతినిధ్యం లేని జిల్లాలతోపాటు సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఆరు బెర్తులు ఖాళీగా ఉంటే..  దాదాపు డజన్ మంది ఎమ్మెల్యేలు పదవులు ఆశిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఓసీలోని రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు అమాత్య పదవి కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలను చేసుకుంటున్నారు. 

జిల్లాలవారీగా పోటీ పడుతున్న ఎమ్మెల్యేలు 

రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ఒకరికి మంత్రి వర్గంలో చోటు కల్పించి, మరొకరికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కరు కూడా గెలవలేదు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం.. ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. దానం కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. గతంలో కేసీఆర్  క్యాబినెట్‌లో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మైనార్టీ వర్గానికి క్యాబినెట్‌లో చోటు ఇవ్వాలని భావిస్తే ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన అమీర్‌అలీఖాన్ పేరు కూడా వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మైనార్టీలు విజయం సాధించలేదు. ఇప్పుడు మైనార్టీలకు కచ్చితంగా అవకాశం కల్పించాల్సి ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి బెర్తు దాదాపు ఖరారు అయిందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్ వెంకటస్వామి పదవులను ఆశిస్తున్నారు. ప్రేమ్‌సాగర్‌రావుకు పార్టీలోని పలువురు సీనియర్ల మద్దతుగా ఉన్నారు.   

మాదిగల నుంచి తీవ్ర ఒత్తిడి

ఇక ఎస్సీలోని మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఉన్నారు. ఎంపీ టికెట్లలో మాదిగలకు అన్యాయం జరిగిందని, మంత్రి వర్గంలోనైనా ఒకరికి అవకాశం ఇవ్వాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. అదే జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే, మంత్రి వెంకట్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చారని సమాచారం. ఇక ఎస్టీలోని ఆదివాసి నుంచి సీతక్క మంత్రిగా ఉన్నారు.

లంబాడకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో అధిష్ఠానం ఆలోచిస్తున్నటు తెలుస్తోంది. ప్రధానంగా జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రులుగా పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ మాత్రమే ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో అవకాశమిస్తామని రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమని చెప్తున్నారు. గొల్ల, కురుమ సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పేరును సూచిస్తున్నారు.