మంత్రి సీతక్క, ప్రభుత్వానికి అభ్యర్థుల ధన్యవాదాలు
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు శనివారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలోని 588 మంది కారు ణ్య నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. పీఆర్‌అండ్‌ఆర్‌డీ శాఖలో పనిచేస్తున్న 588 మంది అనారోగ్య, ఇతర సమస్యలతో చనిపోయారు.
విధుల్లో ఉండి చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం కారుణ్య నియామాకాలు చేపడుతుంది. గత సర్కార్ హయాం నుంచే పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామాకాలు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశావాహులు మంత్రి సీతక్కను కలిసి సమస్యను విన్నవించారు. దీంతో ప్రత్యేక చొరవ తీసుకొని కారుణ్య నియామాకాలకు సీఎంను ఒప్పించారు. ఈ విషయంలో సీతక్క చేసిన కృషికి, తమ సమస్యకు పరిష్కారం చూపిన ప్రభుత్వానికి అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు.