23-03-2025 11:42:21 AM
డివైడర్ను ఢీకొని అవతలి వైపు రోడ్డుపైకి వెళ్లి టాటా సఫారీ ఢీకొట్టిన వైనం
క్యాబ్ డ్రైవర్ మృతి
మరో ఐదుగురికి గాయాలు
రాజేంద్రనగర్: నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ క్యాబ్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై డివైడర్ ను ఢీకొని అవతల ఉన్న రోడ్డు పైకి దూసుకెళ్లి టాటా సఫారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న టాటా జైలో క్యాబ్ నార్సింగి వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డుపై డివైడర్ను ఢీకొంది. అనంతరం అవతల వైపు ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లి పల్టీలు కొడుతూ అటుగా వస్తున్న టాటా సఫారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్ డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. టాటా సఫరీ ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ను రాజేంద్రనగర్ శివరాంపల్లికి చెందిన ఆనంద్ కామ్లీగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మితి మీరిన వేగంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.