బెల్లంపల్లి (విజయక్రాంతి): మందమర్రి ఏరియా పరిధిలోని కేకే 5, కాసిపేట1, కాసిపేట2, కేకే ఓసిపి, జిఎం కార్యాలయం, శాంతి ఖని గని ని బుధవారం సాయంత్రం సింగరేణి సంస్థ సీ అండ్ ఎండి ఎన్. బలరాం నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ తమ కేటాయించిన విధులను తప్పనిసరిగా ఎనిమిది గంటల సమయంలో నిర్వర్తించాలని, భారీ యంత్రాల వినియోగ సమయము పెంచాలని సూచించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా హాజరవుతూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. మందమరి ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి అధికారులు, ఉద్యోగులు,సూపర్వైజర్లు, మైనింగ్ సిబ్బంది, కోల్ కట్టర్, సపోర్ట్ మెన్స్,వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వారికి కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
సంస్థలో మహిళా ఉద్యోగులు పెరుగుతున్న సందర్భంగా వారికి కావలసిన అన్ని ఏర్పాట్లను సంస్థ చేస్తుందని, అలాగే మహిళా ఉద్యోగులు ఉత్పత్తి, ఉత్పాదకతకు కృషి చేయాలని కోరారు. వివిధ కేటగిరీల ఉద్యోగాలను చేస్తూ ఉండాలని, భూగర్భంలో కూడా దిగి సంస్థ ఉత్పత్తి ఉత్పాదకు తోడ్పడాలని సూచించారు. సంస్థలో చేరిన మహిళలకు ఈపీ ఆపరేటర్లుగా వెళ్లడానికి అవకాశం ఉందని దానిని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి జనరల్ మేనేజర్ జి.దేవేందర్, ఎస్ ఓ టు జిఎం విజయ్ ప్రసాద్, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఎస్ఓ రవీందర్, ఏజెంట్ రాందాస్, శాంతిఖని ఏజెంట్ ఎండి ఖాదిర్, ఏఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట్ స్వామి, బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ మరియు మందమరి ఏరియా అన్ని గనుల మేనేజర్లు, నాయకులు, వివిధ గనుల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.