calender_icon.png 1 November, 2024 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బై బై.. డేవిడ్ భాయ్

26-06-2024 12:57:48 AM

కింగ్స్‌టౌన్: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది వన్డే, టెస్టులకు గుడ్‌బై చెప్పిన వార్నర్ తాజాగా టీ20 క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆటకు గుడ్‌బై చెబుతానని వార్నర్ ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ ఆస్ట్రేలియా కథ ముగియడంతో టీమిండియాతో మ్యాచ్ అనంతరం వార్నర్ ఆటకు టాటా చెప్పేశాడు. టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన వార్నర్ 2009లో టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

ఆసీస్ తరపున 110 మ్యాచ్‌ల్లో 3277 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 28 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 112 టెస్టుల్లో 8,786 పరుగులు, 161 వన్డేల్లో 6,932 పరుగులు సాధించాడు. మొత్తంగా మూడు ఫార్మాట్లు కలిపి 49 సెంచరీలు చేసిన వార్నర్ 19వేలకు పైగా పరుగులు సాధించాడు. ఐపీఎల్ ద్వారా భారత అభిమానులకు మరింత దగ్గరైన వార్నర్ 2014 నుంచి 2021 మధ్య సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతడి సారథ్యంలోనే హైదరాబాద్ 2016లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. ‘నా రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం. కొంతకాలంగా నిలకడగా రాణించడంలో విఫల మవుతున్నా. అందుకే ఈ నిర్ణయం. ఇక నుంచి కుటుంబానికి పూర్తి సమయం కేటాయిస్తా’ అని వార్నర్ తెలిపాడు.