calender_icon.png 16 October, 2024 | 2:23 PM

50 చోట్ల ఉప ఎన్నికలు

16-10-2024 03:53:46 AM

48 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు షెడ్యూల్

కేరళలోని వయనాడ్‌లో నవంబర్ 13న పోలింగ్

రాహుల్‌గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన స్థానం

కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక ఇప్పటికే ఖరారు

15 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్

అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 9 సీట్లకు ఎన్నికలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు భారీగా ఉప ఎన్నికలు కూడా జరుగనున్నాయి. 15 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ స్థానాలతోపాటు రెండు లోక్‌సభ సీట్లకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీఐ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.

లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వదులుకొన్న కేరళలోని వయనాడ్ స్థానంతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ స్థానం ఉన్నది. నాందేడ్ కాంగ్రెస్ ఎంపీ వసంతరావ్ చవాన్ మరణించటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. రాహుల్‌గాంధీ గత లోక్‌సభ ఎన్నికల్లో వయనా డ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి కూడా గెలుపొందారు.

దీంతో వయనాడ్‌ను వదులుకొన్నారు. ఈ స్థానం నుంచి రాహుల్ సోదరి ప్రియాంక వాధ్రా పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో పది అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉండగా 9 స్థానాలకే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

మిల్కీ పూర్ స్థానంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఎన్నిక నిర్వహించటంలేదు. పశ్చిమబెంగాల్‌లో ఖాళీగా ఉన్న ఓ లోక్‌సభ స్థానంపై కూడా కేసు ఉండటంతో అక్కడా వాయిదా వేశారు. 

అసెంబ్లీ స్థానాలు

ఉత్తరప్రదేశ్ (9): మీరాపూర్, కుందార్కి, ఘజియాబాద్, ఖైర్, కర్హాల్, ఫూల్‌పూర్, కాటేహారి, మఝావాన్, సిషామౌ.

రాజస్థాన్ (7): కిన్‌శ్వార్, దౌడా, ఝుంజును, డియోలి- ఉన్‌లారా, సలుంబర్, రామ్‌ఘర్, చొరాసి.

పశ్చిమబెంగాల్ (6): తల్దాంగ్ర, స్తాయ్, నైహటి, హొరావ్, మేదినీపూర్, మదరిహట్.

అస్సాం (5): ధోలై, సిద్లీ, బొంగైగావ్, బెహలి, సమగురి.

బీహార్ (4): రామ్‌గఢ్, తరారీ, ఇమామ్‌గంజ్, బేలాగంజ్. 

కర్ణాటక (3): షియగ్గావ్, సందూర్, చెన్నపట్న.

మధ్యప్రదేశ్ (2): బుధ్ని, విజయపూర్.

సిక్కిం (2): సోరెంగ్ చకుంగ్, నమ్చి సింఘితాంగ్.

కేరళ (2): పాలక్కడ్, చెలక్కర.

ఛత్తీస్‌గఢ్ (1): రాయ్‌పూర్ సిటీ సౌత్.

మేఘాలయ (1): గంబెగ్రె.

ఉత్తరాఖండ్ (1): కేదార్‌నాథ్.