calender_icon.png 4 October, 2024 | 3:05 AM

పగలు ఎడ్లబండ్లు.. రాత్రి టిప్పర్లు

04-10-2024 12:29:58 AM

  1. రాజోళిలో జోరుగా ఇసుక తరలింపు
  2. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో డంపులు 
  3. చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు 

అలంపూర్ , అక్టోబర్ 3: ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా ఇసుక అక్రమ రవాణా ఆగట్లేదు. కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్నివిధాల యత్నించినా అక్రమార్కులు కొత్త తరహాలో దందా సాగిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ పరిధిలోని రాజోళి శివారులో ఉన్న తుంగభద్ర నదీతీర ప్రాంతంలో నిత్యం ఇసుక తరలింపు జోరుగా సాగుతున్నది.

పగలంతా ఎడ్ల బండ్ల సహాయంతో ఒకచోట ఇసుకను డంపు చేసి, అర్ధరాత్రి సమయంలో ఆ ఇసుకను టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌కి కూతవేటు దూరంలో ఇసుక డంపులు ఉన్నా.. పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

స్థానిక అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి కనుసన్నుల్లోనే ఈ తతంగం జరుగుతున్నట్టు సమాచారం. నిత్యం ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఇసుక అక్రమ రవాణా నిలిపివేయాల్సిన  రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇకనైనా యంత్రాంగం చర్యలు తీసుకుని, ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.