calender_icon.png 12 March, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనక దైన్యం

17-05-2024 01:32:37 AM

అకాల వర్షాలకు కల్లాల్లో తడిసిన వడ్లు

కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకుల కొర్రీలు  

తేమపేరుతో వడ్లు కొనేందుకు నిరాకరణ

కంటనీరు పెట్టుకుంటున్న అన్నదాత

కామారెడ్డి/ మంచిర్యాల, మే 16 (విజయక్రాంతి): అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. రేయింబవళ్లు శ్రమపడి పండించిన పంటలను పొట్టనపెట్టుకుంటున్నాయి. ఇక దిగుబడి అమ్మాక చేతికి పైసలు అందుతాయని  ఆశిస్తున్న సమయంలో ఆశలన్నింటినీ అడియాశలు చేస్తున్నాయి. ధా న్యం సేకరణకు తీసుకెళ్లిన తర్వాత నిర్వాహకులు వెంటనే ధాన్యం కొనకపోవడంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ధాన్యాన్ని కల్లంలో ఆరబెట్టి కాపలా కాయాల్సి వస్తున్నది.

ఒకవేళ వర్షం కురిసి ధాన్యం తడిస్తే, కొనుగోలు కేంద్రాల్లోని నిర్వాహకులు దిగుబడి కొనేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు. గురువారం కామారెడ్డి జిల్లాకేంద్రంలోని గాంధీ గంజ్ కేంద్రంలోకి వర్షపు నీరు చేరి ధాన్యం తడిసింది. కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొం డ, భిక్కనూర్, బీబీపేట్, రాజంపేట్, రామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, లింగంపేట్, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లోనూ ఇదే విధంగా ధాన్యం తడిసి ముద్ద అయింది.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిరాకరిస్తుండడంతో రైతులు కలెక్టర్ జితేష్ వీ పాటిల్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని గొల్లపల్లెలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పండించిన వడ్లను విక్రయించేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. యాసంగిలో గ్రామంలో దాదాపు 200 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు కల్లాల్లోనే ధాన్యం ఉంచారు.

దీంతో గురువా రం తెల్లవారుజామున వర్షం కురిసి ధాన్యపు రాశుల్లోకి వరద నీరు చేరింది. వర్షం ఆగిపోయిన తర్వాత హుటాహుటిన కల్లాల వద్దకు వెళ్లి వర్షపు నీటిని బయటకు మళ్లించారు. చేతికొచ్చిన పంట నీళ్లపాలవడంతో ఆవేదనకు గురయ్యారు. అనంతరం రైతులంతా ఒక్కటై ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.