calender_icon.png 25 October, 2024 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెఫెడ్ ద్వారా అపరాలు కొనుగోలు చేయండి

29-08-2024 06:27:38 PM

రుణమాఫీ అమలు చేసి హామీని నిలబెట్టుకోండి

సెప్టెంబరులో రైతు భరోసా అమలు చేయాలి

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం

ఖమ్మం, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా అపరాల కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు డిమాండ్ చేశారు. అపరాలు పండించిన రైతులు మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రైవేటు వ్యాపారులు కనీస ధరకు కొనుగోలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. రైతు సంఘం సమావేశం గురువారం స్థానిక గిరిప్రసాద్ భవన్లో జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో గోవిందరావు మాట్లాడుతూ అపరాల సాగు తగ్గిపోతున్న నేపథ్యంలో -ఆపరాలు సాగు చేసిన రైతులను ప్రభుత్వమే ఆదుకుని మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 27న -జరిగిన ఆందోళనకు మద్దతుగా నిలిచిన రైతాంగానికి రైతు సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేసి హామీని నిలబెట్టుకోవాలని గోవిందరావు సూచించారు. రైతుల్లో ఆందోళన నెలకొందని ప్రభుత్వం ఈ -సమయంలో చిత్తశుద్ధిని చాటాలన్నారు. రైతుభరోసా ఖరీఫ్ అందించలేదని కనీసం యాసంగి పంటకైనా రైతుభరోసా అందించాలని కోరారు. పంటల బీమా, రైతుబీమా, పంటల బోనస్ సక్రమంగా అమలయ్యేందుకు రైతు సంఘం ఆధ్వర్యంలో కార్యాచరణ చేపడతామని గోవిందరావు తెలిపారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు మిడికంటి చిన్నవెంకటరెడ్డి, బానోత్ రాంకోటి తదితరులు పాల్గొన్నారు.