- కేసు ఛేదించిన పోలీసులు
- ప్రధాన సూత్రధారుడు సహా మరో ముగ్గురి అరెస్ట్
- 70 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
వనపర్తి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): వ్యాపారంలో నష్టం వచ్చిన నేపథ్యంలో ఆ అప్పుల నుంచి బయటపడేందుకు ఓ వ్యక్తి వక్రమార్గం పట్టాడు. ఓ వ్యాపారికి చెందిన సొమ్మును మరో ముగ్గురితో కలిసి కాజేసి నిండు ప్రాణాలను తీశాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. మరో ముగ్గురి కుటుంబాలను రోడ్డున పడేశాడు. పోలీసులు నిందితుల నుంచి రూ.70 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ రావుల గిరిధర్ వివరాలు వెల్లడించారు.
రాజస్థాన్‌కు చెందిన దీపక్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లిలో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శేషు బంగారం, వెండితో తయారుచేసిన నగలను నాగర్‌కర్నూల్‌తో పాటు బిజినపల్లితో పాటు ఇతర సమీప ప్రాంతాల్లోని దుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. అలాగే తన వెంట నగదు తీసుకువెళ్తుంటాడు. దీపక్ కూడా శేసు నుంచే బంగారు ఆభరణాలను తీసుకునేవాడు. దీపక్ ఇటీవల వ్యాపారంలో నష్టం వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
దీంతో అతడి కన్ను శేషుపై పడింది. ఎలాగైనా శేషు వద్ద ఉన్న ఆభరణాలు, నగదు దోచుకుని తన అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా రాజస్థాన్‌లో ఉంటున్న తన సోదరుడు రమేశ్‌కు కాల్ చేశాడు. రమేశ్ మరో ఇద్దరు జగదీశ్, ముకేశ్‌కు పథకాన్ని వివరించాడు. వీరంతా గత నెల 21న రమేశ్, జగదీశ్, ముకేశ్ ఫ్లుటైలో హైదరాబాద్‌కు చేరుకుని, అక్కడి నుంచి జడ్చర్లకు వచ్చారు. పక్కా స్కెచ్‌తో శేషును వాహనంలో ఎక్కించుకుని, అతడు స్పృహ కోల్పోయేలా చేశారు.
శేషు ఫోన్‌ను వాగులోకి విసిరేశారు. చిన్నంబావి మండలం వెలగొండ సమీపంలో శేషును హత్య చేశారు. శేషు హత్యకేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మంగళ వారం దీపక్ ఓ వాహనంలో బిజినపల్లి నుంచి నాగర్‌కర్నూల్‌కు వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో దీపక్ ను విచారించగా శేషు హత్య బయటపడిం ది. అనంతరం రమేశ్, జగదీశ్, ముకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుం చి 780 గ్రాముల బంగారం, 7.17 కిలోల వెండితోపాటు 6.53 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సీఐ రామకృష్ణ, సీసీఎస్ సీఐ రవిపాల్, ఎస్సైని ఎస్పీ అభినందించారు.