calender_icon.png 4 March, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టతరమవుతున్న బస్సు ప్రయాణం

03-03-2025 07:04:21 PM

కాటారం (విజయక్రాంతి): రోజు రోజుకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కష్టతరమవుతున్నదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఏ బస్సులలో చూసినా, మహిళలే అధిక సంఖ్యలో దర్శనమిస్తున్నారు. దీంతో పురుషులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులలో ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ, పల్లె వెలుగు సర్వీసులు అధికంగా ఉండటం వల్ల దగ్గరలో ప్రయాణించే అవకాశం ఈ బస్సుల ద్వారానే కొనసాగుతోంది. కానీ ఎక్స్ ప్రెస్ బస్సులను మహిళలు ఉపయోగించుకోవడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, పురుషులు, విద్యార్థులు సైతం ఇబ్బంది పడుతున్నామని వారు అంటున్నారు. కాటారం కేంద్రం నుంచి భూపాలపల్లి, పరకాల, హనుమకొండ రూట్లలో ఎక్స్ ప్రెస్ బస్సులకు సైతం అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కుతుండడం వల్ల, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రయాణాలు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దగ్గరి ప్రాంతాల్లో ప్రయాణించే వారు సైతం ఎక్స్ ప్రెస్ బస్సులను ఆశ్రయించడం వల్ల సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయాణికులు ఎక్కలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటారం, మహాదేవపూర్, కాలేశ్వరం, అలాగే కాటారం నుంచి మంథని, గోదావరిఖని, కరీంనగర్ వైపునకు వెళ్లే బస్సులలో సైతం అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కుతున్నందున బస్సు సర్వీసులను పెంచాల్సిన అవసరం ఉన్నదని ప్రయాణికులు కోరుతున్నారు. కాలేశ్వరం, హనుమకొండ, హైదరాబాదు పట్టణాలకు తరలి వెళ్లే విద్యార్థులకు రాత్రిపూట ప్రత్యేక బస్సులను నడిపించాలని కోరుతున్నారు. కాళేశ్వరం నుంచి రోజు రాత్రి 12 గంటలకు బయలుదేరు విధంగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ వరకు కొత్తగా బస్సు సదుపాయాన్ని కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.  కే పీ హెచ్ బీ వరకు  తెల్లవారుజాము 5 గంటల వరకు చేరుకునే విధంగా సమయానుసారిని పొందుపర్చాలని మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, ఉద్యోగస్తులు కోరుతున్నారు.