calender_icon.png 5 November, 2024 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్‌లో బస్ షెల్టర్లు కావలె..!

15-05-2024 01:51:38 AM

నిలువ నీడలేక ప్రయాణీకుల ఇబ్బందులు

మరో 200 బస్‌షెల్టర్లు ఏర్పాటు కోసం ఆర్టీసీ లేఖ

బల్దియా, ఆర్టీసీ శాఖల మధ్య సమన్వయ లోపం

బస్ షెల్టర్ల సంఖ్యపై అధికారుల్లో అస్పష్టత

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి) : మహానగరంలో సరిపడా బస్ షెల్టర్లు లేక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న క్రమంలో బస్టాపులు వద్ద ఏ మాత్రం నీడ లేకుండానే ప్రధాన రహదారులపై నిల్చోవాల్సి వస్తోంది. ఉన్న బస్‌షెల్టర్లు కూడా బస్సుకోసం వెయిట్ చేసేంత సమయంలో కూడా ప్రయాణీకులకు సౌకర్యవంతంగా లేవనే విమర్శలున్నాయి. అంతే కాకుండా, గ్రేటర్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బస్‌స్టాపులు లేక ప్రయాణీకులు రోడ్లపైనే బస్సుల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితులను గమనించిన ఆర్టీసీ మరో 200 బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీకి ప్రతిపాదనలు పంపారు. 

బస్ స్టాపులపై అస్పష్టత

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీ 24 డిపోల పరిధిలో 2600 బస్సులు నడుస్తున్నాయి. ప్రతి రోజూ 11లక్షలకు పైగానే ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారు. మహానగరంలో ఆర్టీసీ ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీ నిర్దేశించిన బస్‌స్టాపుల్లో జీహెచ్‌ఎంసీనే బస్‌షెల్టర్లను నిర్మించి, నిర్వహిస్తోంది. నాలుగేళ్ల క్రితం నగరంలో దాదాపు 2వేలకు పైగా బస్‌స్టాపులున్నాయి. ప్రస్తుతం 1765 బస్టాపులు ఉన్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతుండగా, 1200 బస్టాపులు ఉన్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు అంటున్నారు. ఒక్కసారి ఈ గణాంకాలను పరిశీలించినట్లయితే నగరంలో బస్టాప్‌ల నిర్వహణపై ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లోపం ఉన్నట్టు స్పష్టమవుతోంది. 

200 బస్టాపులకు ప్రతిపాదనలు

గ్రేటర్ హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేక ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతల నుంచి వర్షాకాలంలో వర్షాల నుంచి బస్‌షెల్టర్లు ప్రయాణికులకు ఎంతో అవసరం. హైదరాబాద్ నగరంలో శివారు ప్రాంతాలతో పాటు కోర్ సిటీలో కూడా అనేక బస్ స్టాపుల్లో బస్‌షెల్టర్లు లేకుండా ఉంటున్నాయి. ఫలితంగా ప్రయాణీకులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రస్తుత వేసవి సీజన్‌లో ఎండ తీవ్రతకు ప్రయాణీకులకు బస్‌షెల్టర్లు లేని ప్రాంతాల్లో తాత్కాలిక షెడ్లను ఆర్టీసీ నిర్మాణం చేస్తోందంటే.. నగరంలో బస్‌షెల్టర్ల కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. అయితే, ఈ పరిస్థితులను గమనించిన ఆర్టీసీ నగరంలో మరో 200 బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీకి లేఖ రాసింది. ఈ విషయంపై జీహెచ్‌ఎంసీ ఈవిడిఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డిని వివరణ కోరగా 200 బస్ షెల్టర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిన విషయం వాస్తవమే. అవి ఇంకా మంజూరు కాలేదని తెలిపారు.