calender_icon.png 26 October, 2024 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సును త్వరలో పునరుద్ధరిస్తాం

15-09-2024 07:17:33 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): గజ్వేల్ నుంచి సయ్యద్ నగర్, రామారం, గొల్లపల్లి, ఇందుప్రియాల్ గ్రామాల మీదుగా చేగుంట వరకు నడుపబడే బస్సును త్వరలోనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని తొగుట సీఐ షేక్ లతీఫ్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్ శర్మ అన్నారు. ఆదివారం రాయపోల్ మండలం సయ్యద్ నగర్, రామారం గ్రామాల నుంచి నిర్మాణంలో ఉన్న రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గజ్వేల్ నుంచి చేగుంట వరకు నడపబడే బస్సు గత కొన్ని నెలలుగా రాకపోకలు నిలిచిపోయిన కారణంగా కాలేజీకి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు నానాఅవస్థలు పడుతున్నారని అన్నారు. వర్షాలు, రోడ్డు మరమ్మత్తుల కారణంగా నిలిచిపోయిన బస్సు రాకపోకలను రోడ్డు విస్తరణ పనులు జరుగుతూ, కంకర రెండు వరుసలలో వేసి ఉండడంతో తిరిగి పునరుద్ధరించాలని డిపో మేనేజర్ కి సూచించారు. అదే క్రమంలో రోడ్డు కాంట్రాక్టర్ తో మాట్లాడి, గుంతలు, మూల మలుపులు ఉన్నచోట రెండు రోజులలోగా కంకర వేసి, బస్సు ప్రయాణానికి అనుకూలంగా రోడ్డు తయారు చేయాలని కాంట్రాక్టర్ కి సూచించారు. సిఐ సూచనలకు అనుగుణంగా డిపో మేనేజర్ స్పందిస్తూ వచ్చే 3 రోజులలోగా ఆయా గ్రామాల మీదుగా బస్సు రాకపోకలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రామారం, గొల్లపల్లి, ఇందుప్రియాల్ గ్రామాల మధ్యలో రోడ్డుకు ఇరువైపులా గల చెట్ల కొమ్మలను ఆయా గ్రామాల పెద్దమనుషులు, గ్రామస్థుల సహకారంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్సై రఘుపతి, ఏడిఎం బాబు నాయక్, రోడ్డు కాంట్రాక్టర్ రమేష్ రావు, పోలీస్, ఆర్టీసీ సిబ్బంది ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.