హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని పాతబస్తీ నుంచి అయ్యప్ప భక్తుల(Ayyappa Devotees)తో శబరిమల(Sabarimala)కు వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్డుపై బోల్తా పడిన ఘటన కేరళ(Kerala)లోని కొట్టాయంలోని కన్మల అట్టివాలం(Kanmala Attivalam) సమీపంలో చోటు చేసింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. అయ్యప్ప భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలోని మాదన్నపేటకు చెందిన భక్తులు శబరిమల ఆలయానికి పాదయాత్రగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఘాట్ రోడ్డు వెంబడి చెట్లు ఉండడంతో అదృష్టవశాత్తూ వాహనం ముందుకు వెళ్లకుండా చెట్లు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని భక్తులు వాపోయారు.
ఈ ప్రమాదంలో సైదాబాద్‌కు చెందిన బస్సు డ్రైవర్ రాజు మృతి చెందాడు. 30 మంది ప్రయాణికులు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 22 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పంబా నదికి 15 కిలోమీటర్ల దూరంలో బస్సు బోల్తా పడింది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను చెప్పట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.