విలక్షణ నటనతో ఆకట్టుకునేవాళ్లలో మోహన్ లాల్ ఒకరు. ఆయన తొలిసారి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఫాంటసీ చిత్రం ‘బరోజ్’. నాలుగేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇతర ప్రాజెక్టుల ఒత్తిడి కారణంగా ‘బరోజ్’ను నెమ్మదిగా ముందుకు నడిపించారాయన. శనివారం ఇన్‌స్టా ఖాతాలో తన మూవీ గురించి అప్‌డేట్ ఇచ్చారు. దసరా సందర్భంగా అక్టోబర్ 3న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను త్రీడీ విధానంలో చిత్రీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలో వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్‌లాల్ నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మోహన్‌లాల్ అస్వస్థతకు గురైనట్టు మలయాళ మీడియాలో వార్తలొస్తున్నాయి. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధ సమస్య, కండరాల నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ దవాఖానలో చేర్పించారని తెలిసింది. ఐదు రోజుల పాటు మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు మోహన్‌లాల్‌కు సూచించినట్టు సమాచారం. ఈ వార్తతో ఆందోళనకు గురవుతున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. తన కొత్త సినిమాలు ‘బరోజ్’, ‘ఎల్2’ పనుల్లో భాగంగా గుజరాత్ వెళ్లిన మోహన్‌లాల్.. అక్కడే అనారోగ్యానికి గురి కాగా, కొన్ని రోజుల క్రితం కొచ్చికి వచ్చారని సినీ వర్గాలు చెప్తున్నాయి.