రూ.94 లక్షల విలువైన మత్తు పదార్థాలు కాల్చివేత
మెదక్, జనవరి 22(విజయక్రాంతి) : మెదక్ జిల్లా ఎక్సైజ్ అధికారులు బుధవారం నాడు భారీ ఎత్తున మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. జిల్లా పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్లలో 30 కేసులలో పట్టుబడిన ఎండు గంజాయి, డైజోఫాం, ఆల్ఫ్రాజోలం మత్తు పదార్థాలను మెదక్, సంగారెడ్డి డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ జి.శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ మండలం కాగజ్మద్దూర్ గ్రామ సమీపంలో ఉన్న మరిడి బయో ఇండస్ట్రీస్లో ధ్వంసం చేశారు.
మెదక్ స్టేషన్ పరిధిలో 12 కేసులకు గాను, రామాయంపేట పరిధిలో 8 కేసులు, నర్సాపూర్లో 10 కేసులకు సంబంధించి రూ.94,07,068 లక్షల విలువైన ఎండు గంజాయి 21.428 కిలోలు, గంజాయి మొక్కలు 19, ఆల్ఫ్రాజోలం 7.877 కిలోలు, డైజోఫాం 3.95 కిలోలు, గంజాయి విత్తనాలు 0.160 కిలోలు, ఆలం 24 కిలోలు ధ్వంసం చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు నాగేశ్వర్రావు, ఎన్.రాణి, ఎం.పద్మ, సబ్ ఇన్స్పెక్టర్లు ఎ.రాకేశ్, బి.మాన్సింగ్, వి.రాఘవేందర్రావు, బి.అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.