పలువురి అరెస్ట్ స్టేషన్‌కు తరలింపు
ఖమ్మం (విజయక్రాంతి): బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ బుధవారం ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మయూరీ సెంటర్‌లో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీ కార్యకర్తలు పెవిలియన్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా వస్తుండగా మయూరీ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. దీంతో పోలీసులు, ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించడానికి ఇదోక ఉదాహరణ అన్నారు. ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టికి మరల్చేందుకే కాంగ్రెస్ ఇటువంటి దాడులకు పూనుకుంటుందని అన్నారు. మళ్లీ ఒకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే కాంగ్రెస్‌కు తగిన రీతిలో బుద్ది చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దొంగల సత్యనారాయణ, భూక్యా శ్యాంసుందర్, రుద్ర ప్రదీప్, అల్లిక అంజయ్య యాదవ్, మందా సరస్వతి, గుత్తా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.