నాగర్‌కర్నూల్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): లేబర్ ఆఫీసర్లమంటూ ఇద్దరు వ్యక్తులు ఇటుక బట్టీ వ్యాపారిని రూల్స్ పాటించడంలేదని రూ.30 వేలు వసూలు చేసి బురిడీ కొట్టించారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోలు గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
గ్రామంలో ఇటుక బట్టీ నడుపుతున్న ఓ వ్యాపారి వద్దకు రెండురోజుల క్రితం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లేబర్ ఆఫీసు నుంచి వచ్చామని, లేబర్ కార్డులు పొందకుండా చిన్నపిల్లలతో పనులు చేయిస్తూ రూల్స్ అతిక్రమించారని బెదిరించారు. జరిమానా కట్టాలంటూ ఫొటోలు తీసుకుని నాగర్‌కర్నూల్ రావాలంటూ వెళ్లారు.
అక్కడికి వెళ్లిన వ్యాపారితో అధికారులే డీల్ మాట్లాడమని చెప్పారంటూ నాగర్‌కర్నూల్ మినీ ట్యాంక్‌బండ్‌పై సెటిల్మెంట్ చేసుకుని రూ.30వేలు ఫోన్‌పే చేయించుకున్నారు. ఒక్క రశీదైనా ఇవ్వాలని వ్యాపారి ఒత్తిడి తేవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. మోసపోయామని తేరుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయయానికి వెళ్లాడు.
అక్కడ కాళ్లబేరానికి వచ్చిన సదరు వ్యక్తులు ఫిర్యాదు చేయకుండా డబ్బులను తిరిగి ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై జిల్లా లేబర్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా అలాంటి నకిలీలను నమ్మవద్దని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.