12 తులాలు బంగారం, అర కిలో వెండి చోరీ
జడ్చర్ల, విజయక్రాంతి: కుటుంబ సభ్యులతో కలసి దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుందామని ఇంటికి తాళం వేసి ఊరికి వెళితే ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీ జరిగిన ఘటన శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే జడ్చర్ల పట్టణంలోని సరస్వతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న పవన్ అనే బంగారు వ్యాపారి దీపావళి సందర్బంగా గురువారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామైన గంగాపూర్ గ్రామానికి వెళ్లారు. ఇదే అదనుగా గుర్తించిన దొంగలు ఇంటి తాళాన్ని విరగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతానికి పాల్పడారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పవన్ ఇంటికి తిరిగి వచ్చి చుడగా తాళం కప్ప విరిగి ఇంట్లో సామాన్లు చిందర వందరగా పడి ఉండటాన్ని గుర్తించాడు. బీరువాలో దాచి ఉన్న 12 తులాల బంగారు, అరకిలో వెండి ఆభరణాలతో పాటు రూ. 10వేలు నగదు చోరి జరిగినట్లు బాధితుడు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.