calender_icon.png 23 December, 2024 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

07-10-2024 01:16:31 AM

దేశవ్యాప్తంగా నిందితులపై 319 కేసులు

నేరగాళ్ల ఖాతాల్లోని 1.61 కోట్లు ఫ్రీజ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రోజుకో కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేసి రూ. కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పంజా విసురుతున్నారు. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లపై ఆపరేషన్ నిర్వహించి కటకటాల్లోకి నెడుతున్నా రు. తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన 18 మంది సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. వీరంతా సైబర్ నేరగాళ్లకు వివిధ రకాలుగా సహాయ పడుతున్నట్లుగా పోలీసులు తేల్చారు. పట్టుబడిన నిందితుల్లో ముగ్గురు సైబర్ నేరగాళ్లు కూడా ఉన్నారు.  ఈ వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదివారం మీడియాకు తెలిపారు.

తెలంగాణలో 45కు పైగా కేసులు..

దేశవ్యాప్తంగా సెక్స్ టార్షన్, కొరియర్, ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ ఫ్రాడ్, పెట్టుబడుల పేరుతో వీరు మోసాలకు పాల్ప డ్డారని, నిందితులపై దేశవ్యాప్తంగా 319 కేసులు ఉండగా, తెలంగాణలో 45కు పైగా కేసులు నమోదయ్యాయని సీపీ వివరించారు. మహారాష్ట్రకు చెందిన నిఖేష్ భాటి, సంజయ్ బీమన్‌దాస్, యోగేశ్ కుమార్, దేవరాజ్ చంద్రవాత్ అలియాస్ నాను, రోహన్ యాదవ్ అలియాస్ సన్నీ, అమీర్ కాశీనాథ్ జాదవ్, మహ్మద్ ఆరిఫ్ బర్కాత్ అలీ షేక్, సాకేత్ సతీశ్, అన్నగోకుల్ దాగే, అజయ్ గోపీనాథ్ మిశ్రా అలియాస్ కపూర్, కపిల్ బహుసాహెబ్ నాగారే, కర్ణాటక రాష్ట్రానికి చెందిన రిధ్‌బేడీ, శ్రీధర్, ఉదయ్ కుమార్, వరుణ్‌కుమార్, జీ కౌశిక్, రాజస్థాన్‌కు చెందిన సమీన్‌ఖాన్ అలియాస్ షామిన్ ఖాన్, శైకుల్‌ఖాన్ మెవాతీని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 5 లక్షల నగదు, 26 సెల్‌ఫోన్లు, 16 ఏటీఏం కార్డులు, 7 బ్యాంక్ ఖాతాలు, 11 చెక్ బుక్‌లు, 10 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే నిందితుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ. 1.61 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో బాధితుల నుంచి రూ. 6.94 కోట్లు కాజేశారని సీవీ ఆనంద్ తెలిపారు.