బంగ్లాకు తన స్థాయి గుర్తు చేసిన భారత్
పాక్‌ను వైట్ వాష్ చేసి గర్వంతో ఇండియాకు
కానీ సీన్ రివర్స్
టెస్టులతో పాటు, టీ20ల్లోనూ నిరాశే..
ఉప్పల్లో కొడితే బంతి తుప్పల్లో పడింది. గేమ్ చూస్తున్నామా లేక వీడియో గేమ్ చూస్తున్నామా అనే ఆశ్చర్యం కలిగేలా బ్యాటర్లు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. చివరి టీ20లో కూడా గెలిచి బంగ్లాకు ‘గుండు సున్నా’ మిగిల్చారు. రెండు నెలల పోరాటంలో గెలుపు రుచి ఎలా ఉంటుందో కూడా బంగ్లా చూడలేదు. పాక్‌ను ఓడించాం అని విర్రవీగుతూ అడుగు పెట్టిన బంగ్లాకు వీపు మోతమోగేలా ట్రీట్మెంట్ ఇచ్చారు.
విజయక్రాంతి ఖేల్ విభాగం: బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగిన మూడో టీ20లో భారత్ 133 పరుగుల తేడాతో విజయం సాధించి సీరీస్‌ను 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది. దాదాపు నెల రోజుల కిందట భారత గడ్డ మీద అడుగుపెట్టిన బంగ్లాను ‘హోల్ వాష్’ చేశారు. టెస్టులతో పాటు టీ20ల్లో కూడా బంగ్లాకు విజయం అనే మాట తెలియకుండా చేశారు.
గేమా లేక వీడియో గేమా?
మొదటి రెండు టీ20లు ఒకెత్తయితే మన ఉప్పల్లో జరిగిన మూడో టీ20 మరో ఎత్తు అన్నట్లు సాగింది. అసలు మనం గేమ్ చూస్తున్నామా.. లేక వీడియో గేమ్ చూస్తున్నామా అనే అనుమానం కలిగేలా మన బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మనోళ్ల దంచుడు దెబ్బకు బంగ్లా బౌలర్లు గాల్లోకి చూస్తూ అలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
అసలు ఫీల్డర్లకు పని లేకుండా చేసిన మన బ్యాటర్లు ఒకానొక దశలో 300 పరుగులు చేస్తారని అనిపించినా కానీ చివరి ఓవర్లో రెండు వికెట్లు పడటంతో 297 దగ్గర ఆగిపోయారు. 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెంచరీతో బంగ్లా బూజు దులిపిన సంజూకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, హర్దిక్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
జూలు విదిల్చిన సంజూ..
సంజూ శాంసన్ ఈ పేరు వింటే ప్రతి ఒక్కరికీ అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రదర్శనలు చేసినా జాతీయ జట్టులో సంజూకు అన్యాయం జరుగుతోందని చాలా మంది వాదన. ఈ సిరీస్‌లో అవకాశం వచ్చినా కానీ సంజూ మొదటి రెండు మ్యాచ్‌లలో పెద్దగా రాణించలేదు. దీంతో అంతా నిరాశపడ్డారు. కానీ మూడో టీ20లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదాడు. తన అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ అందర్నీ ఖుషీ చేశాడు.
తిప్పేసిన బిష్ణోయ్..
మొదటి రెండు టీ20ల్లో జట్టులో స్థానం దక్కని స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి మూడో టీ20లో అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని వాడుకున్న బిష్ణోయ్ మూడు వికెట్లతో బంగ్లా నడ్డివిరిచాడు. టీ20ల్లో 50 వికెట్లు తీసిన అత్యంత పిన్నవయస్కుడిగా (24 సంవత్సరాల 37 రోజులు) రికార్డు నెలకొల్పాడు. అంతే కాకుండా వేగంగా 50 వికెట్ల మార్కును చేరుకున్న బౌలర్‌గా కూడా రికార్డులకెక్కాడు.
సుందర్‌కు అవార్డు
ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ‘ఇంపా క్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు. పాండ్యా, పరాగ్‌లను వెనక్కు నెట్టి సుందర్ ఈ అవార్డు గెలుచుకున్నాడు.