21-02-2025 12:53:48 AM
కరీంనగర్, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజలను తప్పుదోవ పట్టించే కుటిల ప్రయత్నాలు మానుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హితవు పలికారు. గురువారం కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజేపీ అంతర్గత మిత్రుడు కేసిఆర్ నిర్వాకం వల్లనే రాష్ర్టం అప్పుల పాలయ్యిందని అన్నారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్నివర్గాలను ఆదుకుంటూ ప్రజా పాలన అందిస్తే చూస్తూ ఓ్ంవలేక బండి సంజయ్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాడని అన్నారు.
నరేంద్ర మోడీ గుజరాత్ లో నాడు ఎమ్మెల్యే కాకముందే ముఖ్యమంత్రి అయ్యారని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా బండి సంజయ్ ఓడిపోలేదా అని, అంతమాత్రాన వీరిద్దరికీ కూడా రాజకీయ పరిపక్వత లేనట్లేనా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బిజెపియేతర పక్షాలు విమర్శలు చేస్తే కౌంటర్ ఇచ్చేందుకు నిన్న గాక మొన్న వచ్చిన మాజీ మేయర్ సునీల్ రావే దిక్కవడం చూస్తుంటే, బిజెపి పార్టీలో గత కొన్నాళ్ల నుంచి నాయకులుగా కార్యకర్తలుగా కొనసాగుతున్న వాళ్లు నుంచి కనీస స్పందన లేకపోవడం, బండి సంజయ్ బిజెపిలో బలహీన పడ్డట్లు కనిపిస్తోందన్నారు.
క్రమశిక్షణ, పరిపక్వత లేని రాజకీయ వ్యభిచారి సునీల్ రావు అని ఆరోపించారు.టిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మేయర్ పదవి ఇప్పించాలని వినోద్ కుమార్ ను కరీంనగర్ అభివృద్ధి ప్రదాత స్మార్ట్ సిటీ ప్రదాత అన్న సునీల్ రావు ఈరోజు బిజెపిలో చేరగానే బండి సంజయ్ ని అదే నోరుతో కరీంనగర్ అభివృద్ధి ప్రదాతగా పోల్చడం రాజకీయ వ్యభిచారానికి నిదర్శనమని అభివర్ణించారు. ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే సునీల్ రావు ను చూసి ఊసరవెల్లి సిగ్గు పడుతుందని, నీ అవినీతి బాగోతం బహిర్గతం చేస్తే నువ్వు తట్టుకోలేవని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చూసిన సునీల్ రావు ను కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తేనే బిజేపీలో చేరాడని, మురికి నీటిని కలుపుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. నా రాజకీయ జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం అని, కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల కండువా భుజాన వేసుకున్న నేను ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా గానీ పార్టీని వీడకుండా నిబద్ధతతో పని చేశానని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించిన నన్ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మివేసినట్లేనని సునీల్ రావు గుర్తెరగాలని, నికార్సున కాంగ్రెస్ వాదిగా నిబద్ధత కలిగిన పార్టీ సైనికుడిగా నా రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లోనే కొనసాగిందని, కొనసాగుతుందని అన్నారు.
ఖబర్దార్ సునీల్ రావు ఇంకోసారి నిబద్ధత కలిగిన నాపై చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు కాంగ్రెస్ పార్టీ సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ సమావేశం లో ఎండీ తాజ్,శ్రవణ్ నాయక్,కుర్ర పోచయ్య,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,నగేష్ ముదిరాజ్,మామిడి సత్యనారాయణ రెడ్డి,బొబ్బిలి విక్టర్,జీడీ రమేష్, అస్తపురం రమేష్,మ్యాకల నర్సయ్య,జూపాక సుదర్శన్, కాంపెల్లి కీర్తి కుమార్,సిరాజద్దీన్, ఖమృద్దీన్,ఖలీల్,షైన్షా , భారీ,బషీర్,అమెర్, మాసూమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.