calender_icon.png 22 March, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు!

22-03-2025 01:34:59 AM

  1. ఇంట్లో అగ్ని ప్రమాదం..
  2. మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి కనిపించిన నగదు
  3. అలహాబాద్ హైకోర్టుకు జడ్జి బదిలీ!
  4. నగదు దొరకలేదన్న ఫైర్ సర్వీసెస్ చీఫ్

న్యూఢిల్లీ, మార్చి 21: ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు లభించింది. దాదాపు రూ. 15 కోట్ల కంటే ఎక్కువగా లెక్క చూపని సొమ్ము లభించినట్టు సమాచారం. హోలీ రోజు హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో లేరు. ఆ సమయంలో ఆయన ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్ని మాపక శాఖకు ఆయన కుటుంబసభ్యులు సమాచారం అందించారు.

మంటలను ఆర్పేందుకు వెళ్లిన అగ్ని మాపక శాఖ సిబ్బందికి ఆయన నివాసంలో పెద్దఎత్తున నగదు లభించడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారని వార్తలు వచ్చాయి. ఈ డబ్బు లెక్కలో చూపనిదిగా అధికారులు తేల్చారు. ఈ విషయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు తెలియడంతో ఆయన సీరియస్ అయినట్టు సమాచారం.

వెంటనే సుప్రీం కొలీజియంతో చర్చలు జరిపి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు దొరికినందుకు ఆయన్ను బదిలీ చేయలేదని, ఆ నిర్ణయం ఇదివరకు తీసుకున్నదేనని సుప్రీంకోర్టు  స్పష్టతనిచ్చింది. ‘ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించారు.

విచారణ కొనసాగుతోంది. బదిలీ నిర్ణయంతో సంబంధం లేకుండా విచారణ జరుగుతుంది. న్యాయమూర్తి ఇంట్లో డబ్బు  దొరికిన ఘటనపై అనేక పుకార్లు, తప్పుడు వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి.’ అని సుప్రీం కోర్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు, మరిం  సమాచారాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సేకరిస్తున్నారు.

ఆ వివరాలు త్వరలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించే అవకాశం ఉంది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా ప్రాథమిక విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఆర్టికల్ 124 (4) ప్రకారం జస్టిస్ వర్మను పదవికి రాజీనామా చేయమని అడిగే హక్కు లేదా తొలగించే హక్కు పార్లమెంట్‌కు ఉంది. 

 జస్టిస్ వర్మను బదిలీపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ స్పందిస్తూ.. జస్టిస్ వర్మ ఇంట్లో మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్ని మాపక సిబ్బందికి ఎటువంటి నగదు దొరకలేదని చెప్పడం గమనార్హం.   

డబ్బు ఎవరిదో తేల్చండి: కాంగ్రెస్

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ మీడి యా అండ్ పబ్లిసిటీ వ్యవహారాల చైర్మన్ పవన్ ఖేరా మాట్లాడారు. ‘జస్టిస్ వర్మ ఉన్నావ్ రేప్ కేసుతో పాటు మరెన్నో సీరియస్ కేసులను విచారిస్తున్నారు. న్యాయ  మీద దేశ పౌరుల్లో నమ్మకం సన్నగిల్లకుండా చూడాలి. ఆ డబ్బు ఎవరిది? ఎందుకోసం న్యాయవాదికి ఇచ్చారు? అనే విషయాలు బహిర్గతం చేయాలి. ఈడీ, సీబీఐల కంటే అగ్నిమాపక శాఖ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తోంది’ అని పేర్కొన్నారు.  

అలహాబాద్ కోర్టు చెత్త బుట్ట కాదు.. 

అలహాబాద్ కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు లేఖ రాశారు.  జస్టిస్ వర్మ రాకను అసోసియేషన్‌లోని అనేక మంది సభ్యులు వ్యతిరేకించారు. ‘కొలీజియం తీసుకున్న నిర్ణయం బాధించింది. అసలు అలహాబాద్ కోర్టు చెత్త బుట్ట అనుకుంటున్నారా? అలహాబాద్ కోర్టులో న్యాయమూర్తుల కొరత ఉన్న మాట వాస్తవమే.

చాలా సంవత్సరాలుగా కొత్త జడ్జిలను నియమించలేదు’ అని పేర్కొన్నారు. యశ్వంత్ వర్మ అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్)లోనే జన్మించారు. 1992 నుంచి 2021 వరకు ఆయన అలహాబాద్ కోర్టులోనే విధులు నిర్వర్తించారు. ఆయన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్స్‌రాజ్ కాలేజీలో బీ.కాం (హానర్స్) పూర్తి చేశారు. 

ఇంట్లో నగదు దొరకలేదు

ఢిల్లీ అగ్నిమాపక శాఖ చీఫ్ అతుల్ గార్గ్ స్పందిస్తూ.. ‘జస్టిస్ వర్మ ఇంటికి మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి నగదు దొరకలేదు. మార్చి 14న అర్ధరాత్రి 11.35 గంటలకు కంట్రోల్ రూం కు అగ్ని ప్రమాదం గురించి ఫోన్ వచ్చింది. దాంతో వెంటనే స్పందించిన సిబ్బంది 11.43 వరకు అక్కడకు చేరుకున్నారు.

స్టోర్ రూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కేవలం 15 నిమిషాల్లోనే అగ్నికీలలు అదుపులోకి వచ్చాయి.  మంటలు ఆర్పేసిన తర్వాత మేము పోలీసులకు అగ్ని ప్రమాదం గురించి సమాచారం ఇచ్చాం. మా సిబ్బందికి ఎటువంటి నగదు దొరకలేదు’ అని తెలిపారు.