న్యూఢిల్లీ: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలంపై ఆందోళన జరుగుతోంది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి చెందిన సీటులో నగదు బండిల్ దొరకడంతో గందరగోళం నెలకొంది. కరెన్సీ నోట్ల ఆరోపణలపై విచారణ జరుగుతోందని రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ శుక్రవారం సభకు తెలియజేశారు. కరెన్సీ నోట్ల అంశంపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని జేపీ నడ్డా ఆరోపించారు. రాజ్యసభలో కరెన్సీ నోట్ల అంశంపై విచారణకు బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. దేశం మొత్తాన్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని పీయూష్ గోయల్ విమర్శించారు.
“నిన్న సభ వాయిదా పడిన తర్వాత ఛాంబర్‌లో సాధారణ తనిఖీ సందర్భంగా నేను సభ్యులకు ఇక్కడ తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 నుంచి భద్రతా అధికారులు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నా దృష్టికి తీసుకురాబడింది. విచారణ జరిగేలా చూసుకున్నాను. అదే జరుగుతోందని జగ్‌దీప్ ధంఖర్ అన్నారు.