calender_icon.png 29 October, 2024 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల్లో బదిలీల గుబులు!

12-08-2024 12:03:12 AM

  1. జిల్లాలో ఇద్దరు  డీఎస్పీలకు స్థానచలనం?
  2. బదిలీ కోసం సీఐలు, ఎస్సైల వెయిటింగ్
  3. పోస్టింగ్ ఎక్కడ వస్తుందోనని ఆతృత
  4. ప్రజాప్రతినిధుల అండ కోసం తాపత్రయం..

కామారెడ్డి, ఆగస్టు 11(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో పోలీసులకు బదిలీల టెన్షన్ పట్టుకున్నది. పోస్టింగ్ ఎక్కడ వస్తుందోనని కొందరు ఆతృతగా ఎదురు చూస్తుంటే.. మరికొందరు తమకు అనుకూలమైన స్థానాన్ని వదులుకునేందుకు  ఇష్టపడటంలేదు. జిల్లాలోని కీలక డివిజన్లయిన కామారెడ్డి, బాన్సువాడ డీఎస్పీలకు స్థానచలనం తప్పదని తెలుస్తున్నది. కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా ఎస్పీ సింధూశర్మ కొత్త బృందం ఏర్పాటుపై దృష్టి పెట్టినట్టు సమాచారం.

ఇందులో భాగంగా బదిలీల్లో కీలకమైన విభాగాలకు చురుకైన అధికారులు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ, రేంజ్ డీఐజీల నుంచి నివేదిక ప్రభుత్వానికి వెళ్లినట్లు సమాచారం. సమర్థతకు పెద్దపీట వేస్తూనే మూడేళ్లకు పైగా అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వారిని, గత చరిత్రను బట్టి కీలక పోస్టు కేటాయించవచ్చని తెలుస్తున్నది. 

పనిచేయని అధికారులు బదిలీ..

జిల్లా పరిధిలోని కీలకమైన రెండు డివిజిన్లలో డీఎస్పీలుగా పనిచేస్తున్న వారికి బదిలీ తప్పనిసరి  అని తెలుస్తున్నది. అసాంఘిక కార్యకాలపాలు, గంజాయి, పేకాట  వంటి వాటిని అణిచి వేయాల్సి ఉండగా అనుకున్న స్థాయిలో పనిచేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ డివిజన్‌లలో పలు సంచలనీత్మక కేసులు నమోదైనా విచారణలో పురోగతి నత్తనడకన సాగుతోంది. దీంతో ఆ డీఎస్పీలపై బదీలీ వేటు పడవచ్చని సమాచారం. అలాగే ఇక్కడ పోస్టింగ్‌పై కొందరు ఆశలు పెంచుకున్నారు. అందుకోసం తమకు తెలిసిన ప్రభుత్వ పెద్దలు, సీనియర్ అధికారులను ప్రసన్నం చేసుకునే యత్నాల్లో  ఉన్నారు.

ఎస్‌హెచ్‌వోల కోసం ఎస్సైల పట్టు

జిల్లాలో ఎస్‌హెచ్‌వో(ఎస్సైలు) స్టేషన్లు ఉన్న వాటిపై పలువురు ఎస్సైలు కన్నేశారు. ఆయా స్టేషన్‌లలో పనిచేసేందుకు కొందరు ఉన్నతాధికారులకు వినతులు ఇస్తుండగా.. మరికొందరు రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. డీఎస్పీలు, సీఐలతో పాటు ఎస్సైల బదీలీలు కూడా జరుగనున్న నేపథ్యంలో పలువురు ఎస్సైలు బదిలీల కోసం వేచిచూస్తున్నారు. 

టెన్షన్‌లో సీఐలు

ఎన్నికలకు ముందు ఉమ్మడి నిజామాబాద్ కమిషనరెట్ పరిధిలో పని చేస్తున్న పలువురు సీఐలు బదీలీపై వచ్చారు. ఎన్నికలు పూర్తి కాగానే బదిలీ అవుతామని ఎందరో సీఐలు అనుకున్నా బదిలీలు జరగలేదు. ప్రస్తుతం బదిలీలు జరిగే అవకాశం ఉండటంతో పలువురు సీఐలు టెన్షన్‌లో ఉన్నారు. తమ కుటుంబాలు ఉన్న చోటకు, పాత పోలీస్‌స్టేషన్లకే పంపిచేలా చూడాలని పలువురు  సీఐలు ఎస్పీతో పాటు, కమిషనర్‌ను కలిసి కోరినట్ల సమాచారం.