పోటీలో జాన్సెన్, హారిస్ రవూఫ్
దుబాయ్: భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నవంబర్ నెలకు గానూ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుమ్రాతో పాటు సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్, పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ పోటీలో ఉన్నారు. ఇటీవలే పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించడంలో బుమ్రాదే కీలకపాత్ర. మ్యాచ్‌లో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు తీసుకున్నాడు. ఇక బుమ్రాతో పాటు పోటీలో ఉన్న జాన్సెన్ డర్బన్ వేదికగా లంకతో తొలి టెస్టులో 11 వికెట్లతో రాణించాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన హారిస్ రవూఫ్ మూడో ప్లేయర్‌గా నామినేట్ అయ్యాడు. మహిళల విభాగంలో షార్మిన్ అక్తర్ (బంగ్లాదేశ్), నాదినే డి క్లర్క్ (సౌతాఫ్రికా), డానీ వ్యాట్ (ఇంగ్లండ్) పోటీలో ఉన్నారు.